Ration Rice Dispute: స్టెల్లా షిప్ సీజ్‌పై కస్టమ్స్ అధికారి శ్రీధర్ కీలక ప్రకటన
స్టెల్ షిప్ సీజ్‌పై కస్టమ్స్ అధికారి శ్రీధర్ కీలక ప్రకటన చేశారు..
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ సీ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ తరలింపును కలెక్టర్, కస్టమ్స్ అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ రోజు కాకినాడ నుంచి సముద్రమార్గం నుంచి టన్నులకొద్ది బియ్యాన్ని విదేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా షిప్‌పై దాడి చేసి సీజ్ చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంట్రీతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పూర్తి విచారణ జరిగే వరకూ షిప్‌ను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించడం మరింత సంచలనంగా మారింది. షిప్ ను సీజ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని, నేవీ వాళ్లకు మాత్రమే ఉంటుందని అటు వైసీపీ నాయకులు విమర్శలు చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై లోతైన విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్‌ను నియమించింది.
ఈ నేపథ్యంలో షిప్ సీజ్ అంశంపై కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీధర్(Principal Customs Commissioner Sridhar) కీలక ప్రకటన చేశారు. పీడీఎస్ రైస్(PDS Rice) ఎగుమతులను తీవ్రంగా పరిగణిస్తున్నామని, అయితే కస్టమ్స్ పాత్ర ఉందా లేదా అనేది కూడా ఆరా తీస్తున్నామన్నారు. స్టెల్లా షిప్ సీజ్(Stella ship Seez) అని అప్పుడే చెప్పలేమని శ్రీధర్ స్పష్టం చేశారు. ఒక షిప్‌లో చాలామందికి చెందిన సరుకులు ఎగుమతులు అవుతుంటాయని, ఎవరో ఒకరు అక్రమాలకు పాల్పడితే అందిరికీ వర్తించదని తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న సరుకులను మాత్రమే సీజ్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం స్టెల్లా షిప్‌లోని శాంపిల్స్ సేకరించి ల్యాబ్ పంపుతున్నామని పేర్కొన్నారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. గతంలో విశాఖ పోర్టులో ఓ కంటైనర్‌లో లభ్యమైన సరుకుల్లో డ్రగ్స్ లేదని సీబీఐ తేల్చిందని చెప్పారు. దాంతో ఆ షిప్ ను రిలీజ్ చేశామని కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషన్ ఎన్. శ్రీధర్ వెల్లడించారు.