చంద్రబాబు అరెస్ట్ చెల్లదు.. సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, అరెస్ట్ వ్యవహారంపై సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం, చట్ట విరుద్ధమన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం, దర్యాప్తు చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు. అవినీతి శాఖ చట్టంలోని 17ఎ(సి) సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి అన్నారు. గవర్నర్ అనుమతిని సీఐడీ పోలీసులు తీసుకున్నారా లేదా అనే దానిపై స్పష్టత లేదన్నారు.
గవర్నర్ అనుమతిస్తే ఆ పత్రలివ్వాలని దర్యాప్తు అధికారులను అడగాలన్నారు. గవర్నర్ అనుమతి తీసుకోకుంటే దర్యాప్తు చెల్లుబాటు కాదన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా అదుపులోకి తీసుకుంటే అది అక్రమ నిర్భందమే అని చెప్పారు. అక్రమంగా నిర్భంధించిన అధికారులపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. అధికారులు తప్పు చేస్తే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ప్రజాప్రతినిధులపై నేరుగా నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. తప్పనిసరిగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే అన్నారు.