కక్షతో కాలయముడైన స్నేహితుడు.. కారణమైన ప్రేమ..

తను ప్రేమిస్తున్న యువతితో సన్నిహితంగా ఉంటున్నాడన్న

Update: 2024-06-29 13:36 GMT

దిశ,కూకట్​పల్లి: తాను ప్రేమిస్తున్న యువతితో సన్నిహితంగా ఉంటున్నాడన్న కసి తన చిన్ననాటి స్నేహితుడిని కసాయిగా మార్చింది. స్నేహితులతో కలిసి మాట్లాడుకుందామని పిలిపించి బీర్​ బాటిల్ తో దాడి చేసి, గొంతు నులిమి స్నేహితుడిని హతమార్చి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు రైలు పట్టాలపై మృతదేహాన్ని పడేసిన సంఘటన అల్లాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్లాపూర్​ సీఐ వెంకట్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన మొహ్మద్​ అహ్మద్ గత 25 సంవత్సరాలుగా మూసాపేట్​ సర్కిల్​ పరిధి అల్లాపూర్​ డివిజన్​ పరిధిలోని సఫ్దర్​ నగర్​ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అహ్మద్​కు ఓ కూతురు, ఓ కొడుకు ఇద్దరు సంతానం. అహ్మద్​ కుమారుడు మొహ్మద్​ యాహియా దానిష్​(17) మాస్టర్స్​ జూనియర్​ కళాశాలలో ఇంటర్​ బైపీసీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి ​బయటకు వెళ్లిన దానిష్​ రాత్రి తిరిగి రాలేదు, దీంతో అహ్మద్​ 23వ తేదీ ఉదయం అల్లాపూర్​ పోలీస్​ స్టేషన్​లో మిస్సింగ్​ కంప్లెయింట్​ ఇచ్చాడు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్న పోలీసులు బోరబండ రైల్వే ట్రాక్​పై ఓ యువకుడి మృతదేహం లభ్యమైనట్టు అహ్మద్​కు సమాచారం అందించారు. రైలు పట్టాలపై లభ్యమైన మృతదేహం రెండు ముక్కలుగా ఉంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న దానిష్​ కుటుంబ సభ్యులు మృతదేహం దానిష్​దిగా గుర్తించారు. దీంతో మిస్సింగ్​ కేసుగా నమోదు చేసుకున్న అల్లాపూర్​ పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హత్యగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రైలు పట్టాల వద్ద లభించిన సెల్​ఫోన్ సిగ్నల్స్​​ ఆధారంగా నిందితుడు సఫ్దర్​నగర్​కు చెందిన గతంలో హత్యకు గురైన ఓ రౌడీ షీటర్​ కొడుకు గా గుర్తించారు. లభించిన ఆధారంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దానిష్​ హత్యను చేధించారు. రౌడీ షీటర్​ కొడుకుతో పాటు మరి తొమ్మిది మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిలో ఐదుగురు మైనర్​లు కాగా మిగిలిన వారు మేజర్​లుగా గుర్తించారు.

తను ప్రేమిస్తున్న యువతితో సన్నిహితంగా ఉంటున్నాడనే..

సఫ్దర్​నగర్​కు చెందిన రౌడీ షీటర్​ కొడుకు దానిష్​తో పాటే చదువుకునే వాడు. తనకు దగ్గరి బంధువు అయిన యువతితో దానిష్​ సన్నిహితంగా ఉంటుండడంతో పలుమార్లు రౌడీ షీటర్​ కొడుకు తన స్నేహితుడైన దానిష్​ను సదరు యువతిని తాను పెళ్లి చేసుకుంటానని, తనతో సన్నిహితంగా ఉండకూడదని పలు మార్లు హెచ్చరించాడు. దానిష్​ అతడి మాటలు పెడుతున్నాడని భావించి దానిష్​పై కక్ష పెంచుకున్న రౌడీ షీటర్​ కొడుకు ఈ నెల 22వ తేదిన బోరబండ రైల్వే ట్రాక్​ సమీపంలో కూర్చుందామని పిలిచాడు. దీంతో దానిష్​ అక్కడికి చేరుకోగా అక్కడ రౌడీ షీటర్​ కొడుకుతో పాటు మరి తొమ్మిది మంది యువకులు ఉన్నారు. అందరూ కలిసి గంజాయి సేవించారు. తమతో పాటు తెచ్చుకున్న బీర్​ బాటిళ్లతో రౌడీ షీటర్​ కొడుకు అతడి స్నేహితులు ఒక్కసారిగా దానిష్​ తలపై దాడి చేశారు. అప్పటికి మృతి చెందలేదని భావించిన వారు తీవ్ర గాయాలపాలైన దానిష్​ను గొంతు నులిమి హత్య చేశారు.

ప్రమాదంగా చిత్రీకరించారు..

దానిష్​ను బీర్​ బాటిళ్లతో దాడి చేసి, గొంతు నులిమి హత్య చేసిన తర్వాత నిందితులు దానిష్​ మృతి హత్య కాకుండా ప్రమాదంగా చిత్రీకరించేందుకు దానిష్​ మృతదేహాన్ని రైల్​ పట్టాలపై పడేసారు. 23వ తేదీ రైలు పట్టాలపై రెండుగా తెగి పడి ఉన్న దానిష్​ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు దానిష్​ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

నిందితుడిని పట్టించిన సెల్​ ఫోన్​ సిగ్నల్స్​..

దానిష్​ మృతదేహం లభ్యం అవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్​ కేసును హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దానిష్​ను గత కొన్ని రోజుల క్రితం రౌడీ షీటర్​ కొడుకు భయపెట్టడం, హెచ్చరించడం వంటి వివరాలు సేకరించిన పోలీసులు రౌడీ షీటర్​ కదలికలు, సెల్​ ఫోన్​ సిగ్నల్స్​పై వివరాలు సేకరించారు. దానిష్​ హత్య జరిగిన సంఘట ప్రదేశంలో రౌడీ షీటర్​ సెల్​ఫోన్​ సిగ్నల్స్​ లభ్యమవడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు నిందితుడు జరిగిన విషయాన్ని అంగీకరించాడు. రౌడీ షీటర్​ కొడుకుతో పాటు దానిష్​ హత్యలో సహకరించిన మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్​ చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులలో ఐదుగురు మైనర్​ కావడంతో జువెనల్​ హోంకు తరలించినట్టు అల్లాపూర్​ సీఐ వెంకట్​ రెడ్డి తెలిపారు.

Similar News