ప్రియురాలిని కారులో తీసుకెళ్లిన రియల్టర్.. ఆ దృశ్యం చూసి షాకైన పోలీసులు

డబ్బు లేదా కామం. ఈ రెండే మనిషి ప్రాణాలను శాసిస్తున్నాయి. అతి పరిచయంతో డబ్బులు తీసుకోవడం.. అతి చనువుతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది.

Update: 2024-07-01 14:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : డబ్బు లేదా కామం. ఈ రెండే మనిషి ప్రాణాలను శాసిస్తున్నాయి. అతి పరిచయంతో డబ్బులు తీసుకోవడం.. అతి చనువుతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఆ తర్వాత ఈ రెండు వికటించి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ రియల్టర్ తన ఆఫీసులో పని చేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమెకు లక్షల రూపాయలు కట్టబెట్టి చివరకు ప్రాణాలు తీశాడు. ఉప్పల్‌లో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులు మీడియాకు వెల్లడించారు.

రామంతపూర్‌లోని శ్రీనగర్ కాలనీకి చెందిన పెన్నాం చంద్రమౌళి గత కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇందులో భాగంగా నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఎస్ఎన్ఎస్ రియల్ ఎస్టేట్ (SNS Real estate ) పేరుతో ఆఫీస్ నడుపుతున్నాడు. అదే ఆఫీసులో రామంతపూర్‌కు చెందిన కొమ్మవారి మంజుల ఉద్యోగినిగా పని చేస్తుంది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం మంజుల, చంద్రమౌళి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యంతో చంద్రమౌళి తన ప్రియురాలైన మంజులకు రూ.28 లక్షలు ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. గత మూడు నెలలుగా మంజుల చంద్రమౌళిని పట్టించుకోకుండా మరో వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతోంది. ఈ విషయాన్ని గమనించిన చంద్రమౌళి తన దగ్గర డబ్బులు తీసుకుని మరో వ్యక్తితో క్లోజ్‌గా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో మంజులపై పగ పెంచుకున్నాడు. ఎలాగైన ఆమెను అంతమొందించాలని పధకం వేశాడు.

మంజులను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్న చంద్రమౌళి ఆదివారం సాయంత్రం ఫుల్లుగా మద్యం సేవించి రామంతపూర్ నుంచి ఆమెను కారులో ఎక్కించుకుని ఉప్పల్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో గొడవ పడటమే కాకుండా కారుతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశాడు. మంజుల చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత నేరుగా ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. చంద్రమౌళి ఇచ్చిన సమాచారం పోలీసులు షాకయ్యారు. వెంటనే తేరుకుని హూటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లి మంజుల మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం చంద్రమౌళిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News