ఖైదీలకు ఉక్రెయిన్ బంపర్ ఆఫర్!.. యుద్దం సిద్దమైతే విడుదల చేస్తాం

గత రెండున్నర సంవత్సరాలుగా రష్యాతో యుద్దంలో పోరాడుతున్న ఉక్రెయిన్ జైళ్లలో ఉండే ఖైదీలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Update: 2024-07-01 11:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గత రెండున్నర సంవత్సరాలుగా రష్యాతో యుద్దంలో పోరాడుతున్న ఉక్రెయిన్ జైళ్లలో ఉండే ఖైదీలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. యుద్దంలో పాల్గొని దేశం తరుపున పోరాడతామంటే విడుదల చేస్తామని తెలిపింది. రష్యా ఉక్రెయిన్ యుద్దంలో ఉక్రెయిన్ తన సైనికులను భారీగా కోల్పోయింది. దీంతో ఉక్రెయిన్ సిబ్బంది కొరతతో సతమతమౌతుంది. ఈ నేపధ్యంలోనే సిబ్బంది కొరతను తీర్చుకొని సైన్యాన్ని పటిష్టం చేసేందుకు దేశ వ్యాప్తంగా భారీగా నియమకాలకు సిద్దమైంది. ఈ క్రమంలోనే మరో అడుగు ముందుకేసి జైళ్లలోని ఖైదీలను కూడా మిలటరీల చేర్చుకునేందుకు సిద్దపడింది. దీనికోసం వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మస్కోకు వ్యతిరేకంగా పోరాడతామనే వారిపై కేసులు కొట్టేసి జైలు నుంచి విడుదల చేస్తామని ఖైదీలకు ఆఫర్ ఇచ్చింది.

దీని కోసం వారికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించి.. ఈ నిర్భంద జీవితానికి ముగింపు పలకి, కొత్త జీవితాన్ని ప్రారంభించండి అని చెబుతూ.. ఇందుకోసం మీరు మాతృభూమిని కాపాడుకునేందుకు ఫ్రంట్ లైన్ లో పోరాడాలని వారిలో స్పూర్తిని నింపుతున్నారు. కాగా గత నెలలో ఖైదీలను విడుదల చేసి ఆర్మీలో చేర్చుకునేందుకు ఉక్రెయిన్ పార్లమెంట్ ప్రత్యేక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం ఇప్పటికే 3000 వేల మంది ఖైదీలను పైలట్ ప్రోగ్రామ్ కింద ఆర్టీలో జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు మరో 27 వేల మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇందులో ఖైదీలకు పడిన శిక్ష ఆధారంగా సమీక్ష జరిపి, వారి ఆరోగ్య సమస్యలు పరీక్షించిన తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. హత్య, అత్యాచారం చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని ఆర్మీలో చేరడానికి అనర్హులుగా ప్రకటించారు.

Similar News