దాదాపు నిద్రపోయినంత పనైంది.. ట్రంప్ తో డిబేట్ లో తడబాటుపై స్పందించిన బైడెన్

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవలే బిగ్ డిబేట్ జరిగింది. అయితే, ఈ చర్చలో బైడెన్ చాలాసార్లు తడబాటుకు గురయ్యారు.

Update: 2024-07-03 03:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవలే బిగ్ డిబేట్ జరిగింది. అయితే, ఈ చర్చలో బైడెన్ చాలాసార్లు తడబాటుకు గురయ్యారు. ఆయన్ని పోటీ నుంచి తప్పించాలని కొన్ని వర్గాల నుంచి వాదన వినిపిస్తోంది. ఇలాంటి టైంలో, తడబాటుకు గురైనట్లు స్వయంగా బైడెన్ అంగీకరించారు. తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని బైడెన్ తెలిపారు. . వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జెట్ లాగ్ వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందని పేర్కొన్నారు. అందుకే డిబేట్ లో సరిగ్గా వాదించలేకోపోయానని ఆయన తెలిపారు. తాను మరింత చురుగ్గా వ్యవహరించాల్సి ఉండేదని వెల్లడించారు. అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను కోరారు. దీన్ని సాకుగా భావించొద్దని.. కేవలం వివరణగా మాత్రమే తీసుకోవాలని కోరారు

వైట్ హౌజ్ ఏమందంటే?

ట్రంప్‌తో జరిగిన డిబేట్ లో బైడెన్ అంతగా రాణించలేకపోయారని వైట్ హౌజ్ కూడా ఒప్పుకుంది. అంతమాత్రాన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేరని అనుకోవద్దని పేర్కొంది. దేశాన్ని మరో నాలుగేళ్లు ముందుకు నడిపించే సామర్థ్యం ఆయనకు ఉందని నొక్కి చెప్పింది. డిబేట్ సమయానికి అధ్యక్షుడు జలుబుతో ఇబ్బందిపడుతున్నారని.. గొంతులో కూడా సమస్య ఉందని అధికార ప్రతినిధి కరీన్ జీన్-పియర్ వివరించారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు పలు సందర్భాల్లో అంగీకరించారని గుర్తుచేశారు. గత మూడున్నరేళ్లుగా బైడెన్‌ అన్ని పనులు, బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తించారని జీన్-పియర్ తెలిపారు. దానికి అభివృద్ధి పనులే సాక్ష్యమని పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు సేవలందించడంలో ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పారు.జీవితాంతం అనేక సవాళ్లు ఎదుర్కొన్న బైడెన్‌కు.. ఈ దశను దాటి ఎలా రావడమో కూడా తెలుసని అన్నారు. డిబేట్ లో ఎలా మాట్లాడామనేది ప్రధానం కాదనీ.. అధ్యక్షుడిగా ఎలా పనిచేస్తామనేదే కీలకమని పేర్కొన్నారు.


Similar News