డ్రైవర్ లేకుండా అకస్మాత్తుగా బస్సు స్టార్ట్.. బంక్ ఉద్యోగిపై నుంచి వెళ్లిపోయింది!

డ్రైవర్ లేకుండానే ఆకస్మాత్తుగా బస్సు స్టార్ట్ అయి ఓ వ్యక్తిపై దూసుకువెళ్లి మృతికి కారణం అయింది.

Update: 2024-07-05 12:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: డ్రైవర్ లేకుండానే ఆకస్మాత్తుగా బస్సు స్టార్ట్ అయి ఓ వ్యక్తిపై దూసుకువెళ్లి మృతికి కారణం అయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్‌ - హర్దోయ్ జిల్లాలో ఓ పెట్రోల్ బంక్‌లో డీజిల్ నింపుకుండమని రాగా అదే సమయంలో బస్సు చెడిపోయింది. దీంతో పెట్రోల్ బంక్‌లోనే బస్సును పెట్టి.. మెకానిక్ కోసం దిగి వెళ్లిపోయాడు. ఆ సమయంలో టైర్ల కింద ఇటుకలు పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే, నిన్న ఉదయం బస్సు అకస్మాత్తుగా దానంతట అదే స్టార్ట్ అయింది. అదే సమయంలో టైర్లలో గాలిని నింపుతున్న పెట్రోల్ బంక్ ఉద్యోగి తేజ్‌పాల్(36) పైనుంచి వెళ్లిపోయి.. ముందు ఆగి ఉన్న ఇంకో బస్సును ఢీ కొట్టి ఆగింది. దీంతో అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురై చూస్తూ ఉండిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ తేజ్‌పాల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటన సమయంలో పెట్రోల్ పంప్ వద్ద ఎవరూ లేకపోవడం, ప్రయాణికులు కూడా లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లు అయిందని పెట్రోల్ బంక్ సిబ్బంది చెప్పుకొచ్చారు. కాగా, కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన స్థలంలోని ప్రైవేటు బస్సును పోలీసులు సీజ్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. సేఫ్టీ అనేది భారత్‌లో జోక్ అయిందని, బ్రిడ్జీలు, రోడ్లు, ఎయిర్ పోర్టులు, రైల్వేలు ఇతర ప్రదేశాల్లో ప్రజలకు సేఫ్ లేదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 

Tags:    

Similar News