Plane Crashes: జనావాసాలపై కుప్పకూలిన భారీ విమానం
జనావాసాలపై భారీ రవాణా విమానం కుప్పకూలింది.
దిశ, డైనమిక్ బ్యూరో: భారీ రవాణా విమానం జనావాసాలపై కుప్పకూలింది. ఈ ఘటన లిథువేనియాలోని (Lithuania) విల్నియస్ ఎయిర్ పోర్టు సమీపంలో లిథువేనియా కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 5: 28 గంటలకు చోటు చేసుకుంది. జర్మనీకి చెందిన కార్గొ సంస్థ డీహెచ్ఎల్ కు (DHL Cargo Plane) చెందిన బోయింగ్ 737 (Boeing 737)భారీ విమానం జర్మనీలోని లీప్ జిగ్ నుంచి బయల్దేరింది. ఈ విమానం లిథువేనియాలోని విల్నియస్ ఎయిర్ పోర్టు (Vilnius Airport) లో ల్యాండ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు లిప్ కల్నిస్ అనే ప్రాంతంలోని జనావాసాలపై క్రాష్ అయింది. ఈ ఘటనలో పైలట్ మరణించగా ముగ్గురు సిబ్బంది గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఈ విమానాన్ని డీహెచ్ఎల్ కోసం స్విఫ్ట్ ఎయిర్ లైన్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ విమానం 31 ఏళ్ల పాతది. విమానం కూలిన ప్రాంతంలోని ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం పేర్కొంది.