ఆ అమెరికన్ యూట్యూబ్ చానెల్‌లో ‘ఇండియా’ విశేషాలు

by Shyam |   ( Updated:2020-11-11 06:10:49.0  )
ఆ అమెరికన్ యూట్యూబ్ చానెల్‌లో ‘ఇండియా’ విశేషాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కొన్ని నెలల ముందు సమంత అనే అమెరికన్.. ఎన్నో పుస్తకాలు, బట్టలతో పాటు అస్పష్టమైన ఆలోచనలతో చికాగో నుంచి తిరువనంతపురానికి ఫ్లైట్ ఎక్కింది. ఇక్కడకు వచ్చిన తర్వాత క్రమంగా కేరళతో, ఇక్కడి మనుషులతో ప్రేమలో పడింది. తిరిగి రెండున్నర నెలల తర్వాత మది నిండా ఎన్నో మధుర జ్ఞాపకాలను నింపుకొని, భారమైన హృదయంతో మళ్లీ అదే ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయింది. కానీ అక్కడికెళ్లాక కేరళను మాత్రం బాగా మిస్ అయిపోయింది. అందుకే తన మనసులో దాచుకున్న కేరళ అనుభవాలను అక్షరీకరించి ‘ఏ న్యూ జర్నీ’ పేరుతో నవలగా తీసుకొచ్చింది. అంతేకాదు తన యూట్యూబ్ చానల్‌లో ఇండియా విశేషాలను వివరిస్తోంది.

కేరళ, కుంబలం అనే ప్రాంతంలోని ఓ స్కూల్‌లో పాఠాలు చెప్పేందుకు అమెరికా నుంచి వచ్చిన సమంత కన్నన్.. మళయాల భాషను అమితంగా ఇష్టపడింది. తన జీవితం చాలా కన్ఫ్యూజన్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏ లక్ష్యం లేకుండా కేరళలో అడుగుపెట్టిన సమంత.. ఇక్కడ చాలా విషయాలు నేర్చుకోవడంతో పాటు మళయాల భాషపై పట్టు సాధించింది. మళయాల మూవీస్, కేరళ ఫుడ్ హ్యాబిట్స్, తన స్కూల్ ముచ్చట్లు, సంప్రదాయాలు, తనకు ఎదురైన అనుభవాలతో పాటు తను నేర్చుకున్న, తనను ఇన్‌స్పైర్ చేసిన ప్రతి విషయాన్ని ‘ఏ న్యూ జర్నీ’ నవలలో రాసుకొచ్చింది.

సమంత ఆ నవలతోనే ఆగిపోలేదు. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా సెలెబ్రిటీగానూ మారింది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా చీర కట్టుకుని, జడలో పువ్వులు, ముఖాన బొట్టు పెట్టుకుని ఆమె వీడియోలు చేస్తుండటం విశేషం. ఇండియా ఎందులో బెటర్, యూఎస్ ఎందులో బాగుండదు, ఇండియాలో ఏం మిస్ అవుతోంది, చీర ఎలా కట్టుకోవాలి, గణేష్ చతుర్థికి కోజుకట్టాయ్ స్వీట్ ఎలా చేయాలి.. ఇలా చాలా విషయాలను తన పేరు(సమంత కన్నన్‌)తో ప్రారంభించిన యూట్యూబ్ చానల్‌లో పంచుకుంటోంది. ప్రస్తుతం తమిళ్ కూడా నేర్చుకుంటున్న సమంత.. తన తొలి నవలకు సీక్వెల్ బుక్ కూడా రాస్తోంది. అంతేకాదు కేరళకు చెందిన కన్నన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న అమెరికన్.. సమంత కన్నన్‌గా ఎలా మారింది? వారి లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది? వంటి విషయాలను ‘2021 వాలంటైన్స్ డే’ రోజున విడుదల అవుతున్న సీక్వెల్‌ బుక్‌లో వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed