అయోమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఎవరు ఎవరివైపు ?

by Shyam |   ( Updated:2021-11-25 04:56:56.0  )
అయోమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఎవరు ఎవరివైపు ?
X

దిశ, భూపాలపల్లి : ఓ వైపు పాత నాయకులు మరోవైపు కొత్త నాయకులు ఇద్దరిని పదవులు వరించాయి. ఇద్దరు అధికార పార్టీలో ఉన్నారు. దీంతో ఎటు వైపు వెళ్లాలో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియని సందిగ్ధం లో భూపాలపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలున్నారు. 2018 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణ రెడ్డి శాసనసభ్యుడిగా ఎన్నికై అనంతరం, ఆరు నెలల తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆయనతో పాటు ఆయనకు అత్యంత సమీపంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం గండ్ర వెంకటరమణ రెడ్డి‌తో పాటు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఓడిపోయిన సిరికొండ మధుసూదనాచారి వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. గండ్ర టీఆర్ఎస్‌లో చేరిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు జరగడంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీ లోకి వచ్చిన వారికి ఆయన వెంట ఉన్న తన అనుచరులకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. దీంతో సిరికొండ వర్గానికి చెందిన వారు చాలా అవమానానికి అసహనానికి గురై టీఆర్ఎస్ పార్టీ నమ్ముకొని ఇన్ని రోజులు ఆ పార్టీలో కొనసాగారు. కొంతమంది గండ్ర వెంట అనుకోని పరిస్థితుల్లో ఉండి పార్టీని నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్నారు. లోపల బాధ ఉన్నప్పటికీ ఉద్యమ సమయంలో పార్టీ కోసం ప్రాకులాడే వారు పార్టీని వీడలేక గండ్ర వద్దకు వెళ్లలేక సతమతమవుతున్నారు.

ప్రస్తుతం సిరికొండ మధుసూదనాచారి‌కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కడం ఆయన వర్గానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇన్ని రోజులుగా అవమానానికి అణిచివేతకు గురైన భూపాల పల్లి నియోజకవర్గం లోని టీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా మధుసూదనాచారికి మద్దతు తెలుపుతూ అతని చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. మధుసూదనా‌చారి‌కి మంత్రి పదవి వస్తుందని లేదా మండలి చైర్మన్ పదవి వస్తుందని అతని అభిమానులు చెబుతున్నారు. మధుసూదనా చారి ప్రభుత్వంలో మంచి హోదాలో పదవి లభిస్తే భూపాలపల్లి నియోజకవర్గంలోని ఉన్న టీఆర్ఎస్ నాయకులు అందరూ అతని వైపు వెళ్లే అవకాశం ఉంది. భూపాలపల్లిలో సిరికొండ వర్గానిదే పైచేయి కావడం‌తో పాటు అతను చెప్పిందే వేదంగా ఈ నియోజకవర్గంలో నడిచే అవకాశం ఉంది. దీంతో గండ్ర వర్గానికి పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. భూపాల పల్లి నియోజకవర్గం‌లో టీఆర్ఎస్‌లు రెండు గ్రూపులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇరువురు నాయకులు పైకి బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం ఒకరిపై ఒకరు అణచివేత ధోరణి అవలంబించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అధికారులు ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇరువురు నాయకులు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉన్న వ్యక్తులు. ఇరువురు ప్రభుత్వంలో మంచి పట్టు ఉండటంతో అధికారులకు ఇప్పుడు సంకటంగా మారింది. ఈ విషయమై భూపాలపల్లి నియోజకవర్గం లో ఉన్న ఏడు మండలాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. 2023 లో జరిగే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed