లక్ష మంది ఉద్యోగుల్ని తీసుకుంటామన్న అమెజాన్.. ఎప్పటినుంచంటే ?

by Harish |
amezon
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ ఏడాది పండుగ సీజన్ నేపథ్యంలో కార్యకలాపాల విభాగంలో లక్ష మందికి పైగా సీజనల్ ఉద్యోగులను తీసుకోనున్నట్టు ప్రకటించింది. ప్రత్యక్షంగా, పరోక్ష విధానంలో మొత్తం 1,10,000 మందిని హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణె, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై నగరాల్లో నియమించనున్నట్టు అమెజాన్ ఇండియా వెల్లడించింది. పండుగ సీజన్ కోసం ప్రత్యేకంగా నియమించే వీరిని నెట్‌వర్క్ అసోసియేట్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ విభాగాల్లో ఉంచనున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌లో వినియోగదారులకు సేవలందించేందుకు నియమించుకోనున్నారు. దీనివల్ల వినియోగదారుల ఆర్డర్లను సురక్షితంగా, సమర్థవంతంగా పూర్తి చేసేందుకు వీలవుతుంది.

అలాగే ప్యాకింగ్, సరఫరా చేయడం వంటి ప్రక్రియను వేగవంతం చేయడానికి వీలవుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ కొత్త నియామకాలు ఈ నెల ప్రారంభంలో దేశవ్యాప్తంగా ప్రకటించిన 8,000 ఉద్యోగాలకు అదనంగా ఉండనున్నాయని అమెజాన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా 2025 నాటికి దేశంలో 10 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు అమెజాన్ ఇండియా కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే తాజా నియామకాలని కంపెనీ వివరించింది. కాగా, దేశీయ మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సైతం ఈ ఏడాది 1,15,000 మందికి పైగా ప్రత్యక్ష రూపంలో ఉపాధి కల్పించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 15 శాతం మహిళలు, వికలాంగులను తీసుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed