మాంసం కోసం గొడవ.. ప్రాణాలుతీసిన నిందితుడు.. ఎక్కడంటే

by Sumithra |
mother killed daughter
X

దిశ, సంగారెడ్డి: మాంసం వడ్డించే విషయంలో గొడవపడి తోటి కూలిన హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల రోజుల క్రితం మంచిర్యాల్ జిల్లా బీమారం మండలం అంకుశాపూర్ గ్రామానికి చెందిన 15 మంది కూలీలు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామ శివారులో ఓ నర్సరీలో మామిడి మొక్కలకు అంటూ కట్టేందుకు వచ్చారు. ఈ నెల 15వ తేదీన పని ముగించుకుని వారు ఉంటున్న రేకుల షెడ్డు చేరుకున్నారు. అదే రోజు రాత్రి భోజనం చేసే సమయంలో దయనేని శివ(31), గోస్కుల పాపన్న అలియాస్ పాపయ్య(37)లు మాంసం వడ్డించే విషయంలో గొడవ పడ్డారు.

ఈ గొడవను మనుసులో పెట్టుకుని శివ అనే వ్యక్తి పాపన్నపై కక్ష పెంచుకుని అతన్ని చంపాలనే ఉద్దేశంతో అక్కడే ప్రక్కన ఉన్న ఒక ఇనుప పైపు ను తీసుకుని పాపన్న తలపై వెనక నుంచి గట్టిగ కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి, పాపన్న తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతన్ని నర్సరీ యజమాని, తోటి కూలీలు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికిందరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్ళగా, అక్కడ చికిత్స పొందుతూ 19వ తేదీన పాపన్న మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడు శివను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కొండాపూర్ సి.ఐ లక్ష్మా రెడ్డి, యస్.ఐ సంతోష్ కుమార్ లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed