ఈ తీర్పుతో ప్రజలు ఎటువైపో తేలిపోయింది

by Sridhar Babu |
Jagadeesh reddy
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని నాగార్జునసాగర్ ఉపఎన్నిక తీర్పుతో తేటతెల్లం అయ్యిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం అనంతరం నల్లగొండలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పు సీఎం కేసీఆర్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ను గెలిపించినందుకు సాగర్ ప్రజలకు ధన్యవాదాలని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శనీయంగా మారాయని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఏదో ఒకట్రెండు సార్లు అపశృతి జరిగినంత మాత్రాన.. ఎవడెవడో రెచ్చిపోయి.. టీఆర్ఎస్‌పై అవాక్కులు చవాక్కులు పేలి మాట్లాడారని గుర్తు చేశారు. ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో పెద్ద పెద్ద నేతలు ఉన్నారని, వారేదో చేస్తారని కొంతమంది ఊహించారని, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని పేర్కొన్నారు. నల్లగొండ అయినా నాగార్జునసాగర్ అయినా.. ఆదిలాబాద్ గానీ ఆలంపూర్ గానీ.. ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటారని చెప్పారు.

టీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, ఉపఎన్నికలో విజయం కోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జానారెడ్డి మీదనే కాదు.. కాంగ్రెస్ నాయకత్వంపైనా ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని, 2018 ఎన్నికల్లోనూ నర్సింహయ్యను గెలిపించినట్టుగా.. నోముల భగత్‌ను అంతకుమించిన మెజార్టీతో గెలిపిస్తారనే ధీమాను ముందుగానే వ్యక్తం చేసినట్టు వివరించారు.

ఏదీఏమైనా ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని, ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తామని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మిర్యాలగూడ ఎన్.భాస్కర్ రావు, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పూల రవీందర్, కంచర్ల కృష్ణారెడ్డి, కటికం సత్తయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed