అది జరిగితే లాక్‌డౌన్ తప్పదు.. కేటీఆర్ హెచ్చరిక

by Shyam |
అది జరిగితే లాక్‌డౌన్ తప్పదు.. కేటీఆర్ హెచ్చరిక
X

దిశ, కూకట్‌పల్లి : కరోనా ఇంకా పోలేదు, నిర్లక్ష్యం వహించడం తగదు లాక్ డౌన్ రావద్దంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో సోమవారం 66.59 కోట్ల రూపాయలతో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి, కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్‌లో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, 45 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రాహ్మణ సంఘం కమ్మునిటి హాల్, జేఎన్ఎన్ యూఆర్ఎం గృహ సముదాయం వద్ద 99 లక్షల వ్యయంతో చేపడుతున్న వీడీసీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంలో ప్రధాన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి సిగ్నల్‌ ఫ్రీ రహదారుల నగరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి వెళ్లే రోడ్డులో నిరంతరం ట్రాఫిక్ సమస్యతో ఉద్యోగులు, స్థానికులు పడుతున్న ఇబ్బందిని పరిష్కరించడానికి 66.59 కోట్ల వ్యయంతో రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్‌యూబీ) నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు.

ఇప్పటికే దాదాపు రూ.1,010 కోట్ల పైగా వ్యయంతో చేపట్టిన 18 ప్రాజెక్టులు నగర పౌరులకు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఇప్పటికే ఎస్ఆర్డిపి మొదటి దశలో గచ్చిబౌలి నుంచి జేఎన్‌టీయూ వరకు ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్లు, బయో డైవర్సిటీ, మైండ్ స్పేస్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్ గాంధీ జంక్షన్లు ప్రారంభం కావడంతో ప్రజలకు ట్రాఫిక్ సమస్యతో ఊరట లభించిందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed