వరల్డ్ కప్ రద్దయినా ఐపీఎల్ సాధ్యమేనా?

by Shyam |
వరల్డ్ కప్ రద్దయినా ఐపీఎల్ సాధ్యమేనా?
X

దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్‌ నిర్వహించాలని ఐసీసీ పట్టుదలతో ఉన్నది. టీ20 వరల్డ్‌ కప్ రద్దు చేసినా ఐపీఎల్‌కు మాత్రం అవకాశం ఇవ్వొద్దని ఇప్పటికే ఐసీసీ వద్ద పెద్ద లాబీయింగ్ జరిగినట్లు సమాచారం. అందుకే టీ20 వరల్డ్ కప్‌పై ఐసీసీ నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తూ వస్తున్నది. వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఎలాగైనా టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలని భావించారు. ఆతిథ్యం ఇవ్వనున్న ఆస్ట్రేలియా మేం టోర్నీ నిర్వహించలేం అంటూ లేఖ రాసినా ఐసీసీ మాత్రం మంకు పట్టు వీడటం లేదు. తాజాగా ఆస్ట్రేలియాలో పరిస్థితి చూస్తే వరల్డ్ కప్ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

పెరుగుతున్న కేసులు

ఆస్ట్రేలియాలో అధిక జనసాంద్రత కలిగిన విక్టోరియా రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని మెల్‌బోర్న్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఫైనల్స్ సహా ఏడు మ్యాచ్‌లు ఇక్కడి స్టేడియంలో జరుగుతాయని నిర్వాహకులు షెడ్యూల్‌లో చేర్చారు. కానీ, ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతుండటంతో విక్టోరియా ప్రభుత్వం పూర్తి కట్టడి చేస్తున్నది. ఇప్పటికే ఆస్ట్రేలియా టాప్ సాకర్ లీగ్స్ ఏ-లీగ్, నేషనల్ రగ్బీ లీగ్స్‌ను మెల్‌బోర్న్ నుంచి తరలించారు. జూలై 15 నుంచి 25 శాతం సామర్థ్యంతో స్టేడియాలను తెరుస్తామని గతంలో ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించారు. పెర్త్ లోని ఆప్టస్ స్టేడియాన్ని 60వేల పూర్తి సామర్థ్యంతో వాడుకోవచ్చని కూడా తెలిపింది. ఈ నిర్ణయాలను ప్రస్తుతం వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నది. విదేశీయుల రాకపోకలను సైతం మరి కొన్నాళ్లు నిషేధించబోతున్నది. రెండు నెలలుగా క్రికెట్ వరల్డ్ కప్‌పై ఊగిసలాడుతున్న ఐసీసీ ఇక తమ నిర్ణయాన్ని స్పష్టం చేయాల్సిన సమయం వచ్చింది. ఈ ఏడాదికి టీ20 వరల్డ్ కప్‌ను మర్చిపోవాల్సిందేనని ఐసీసీ అధికారి ఒకరు చెప్పారు.

ఐపీఎల్ కూడా కష్టమే?

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రాతినిధ్యం వహించే నగరాల్లోనే కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. చెన్నై, ముంబయి, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో కరోనా మరింత పీక్ స్టేజీకి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌లో ఐపీఎల్‌కు సిద్ధం కావాలని ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లేఖ రాశారు. అతి తక్కువ సమయంలోనే ఐపీఎల్‌కు ఏర్పాట్లు చేయగలిగే సత్తా బీసీసీఐకి ఉంది. ఇందుకోసం మద్దతు ఇచ్చే స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్ ఉన్నారు. యాడ్స్ ఆదాయం కాస్త తగ్గినా లాభాలతోనే బయటపడే అవకాశం ఉంది. కానీ, ప్రస్తుత కరోనా కాలంలో ఆటగాళ్లు, ప్రేక్షకుల ఆరోగ్యానికి మాత్రం బీసీసీఐ భరోసా ఇవ్వలేకపోతున్నది. శ్రీలంక, యూఏఈలో సిద్ధంగా ఉన్నా అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిగా ప్రారంభం కాకపోవడం, విదేశీ క్రీడాకారులు లీగ్ ఆడటానికి వస్తారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో టీ20 వరల్డ్ కప్ రద్దయినా ఐపీఎల్ 13వ సీజన్ సాధ్యమయ్యే పని కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story