- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయ్యో కాంగ్రెస్.. ఆ రెండు సీట్లయినా వస్తాయా?
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ పోరులో కాంగ్రెస్ వెనకబడిపోతోంది. అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. గ్రేటర్ పరిధికి వచ్చే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల కమిటీని ప్రకటించిన టీపీసీసీ ఇప్పుడు హడావుడిగా అభ్యర్థుల వేట మొదలుపెట్టింది. ఈ కమిటీలే అభ్యర్థులను ఖరారు చేయాలని సూచించింది. ఒక విధంగా వ్యూహం లేకుండా గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. సిపాయిలు లేకుండా యుద్ధం చేసే తీరులో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. గ్రేటర్ ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నాయకులు ఇప్పటికే బహిరంగ ఆరోపణలకు దిగుతున్నారు. కేవలం పోటీ చేస్తే సరిపోదని, ఎలక్షన్ వ్యూహం ఉండటం లేదంటూ చర్చ జరుగుతోంది.
గత గ్రేటర్ ఎన్నికల్లో 150 వార్డుల్లో కాంగ్రెస్‌కు దక్కిన సీట్లు కేవలం రెండు. టీఆర్ఎస్కు 99, మజ్లిస్ పార్టీకి 44, బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. ఇప్పుడు గ్రేటర్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే లక్ష్యం పక్కన పెడితే కనీసం రెండంకెల స్థానాలైనా గెలుచుకోవడం కష్టంగా మారింది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ గత ఐదేళ్లలో రోజురోజుకూ తగ్గుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఈ విషయం అర్ధమవుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందా? లేదా? అనే అంశాన్ని పక్కన పెడితే రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్కు దీటైన ప్రతిపక్ష పార్టీ గా ఉందనే విషయంలోనూ రాజకీయ విశ్లేషకుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల దుబ్బాక పరిణామాలు కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేశాయి. బీజేపీ గెలువడంతో ప్రత్యామ్నాయ మార్గాలు బీజేపీవైపు మళ్లుతున్నాయనే అనుమానాలు అటు పార్టీలోనూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం, అసలు సిసలైన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని ఘంటా పథంగా చెప్పుకోవాలంటే గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాల్సిందేనని పార్టీ శ్రేణులు చెప్పుతున్నారు. కానీ పరిస్థితులు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి.
రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక గ్రేటర్ ఎన్నికలు మినహా రాష్ట్రంలోని దాదాపు అన్ని రకాల ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఫలితాల విషయానికొస్తే పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పీసీసీ బాధ్యతల నుండి తప్పుకునేందుకు ఉత్తమ్ గత కొద్ది నెలల క్రితం సంసిద్ధమైనప్పటికీ హైకమాండ్ మాత్రం ఇప్పటి వరకు కొత్త అధ్యక్షుడిని నియమించకపోవడంతో ఆయనే కొనసాగుతున్నారు. ఈ పరిణామాల్లో తమిళనాడు ఎంపీ మణికం ఠాగూర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీగా నియమితులయ్యారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది నిర్ణయించనుందని పార్టీ శ్రేణులకు సూచనప్రాయంగా వెల్లడించారు.
గ్రేటర్లో సందడి లేని హస్తం..
వరుస ఓటములతో కుదేలైనట్లు కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. ఎన్నికలంటే ఎంతో కసరత్తు, వ్యూహాలు, ఎత్తుగడలు ఇలా అన్నింటినీ టీపీసీసీ మర్చిపోయిందంటూ కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత పార్టీ ఇంఛార్జీలను ప్రకటించి టికెట్లు ఖరారు చేయాలని సూచించింది. అంతకు ముందు గ్రేటర్ పరిధిలోని వార్డులకు పోటీ చేసే వారు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తమ్ ప్రకటించడం సొంత పార్టీ నేతలను విస్మయానికి గురి చేసింది. ఏండ్ల చరిత్ర ఉన్న పార్టీ గ్రేటర్లో పోటీ చేసే అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంపై స్థానిక నేతలు మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికలపై కాంగ్రెస్ నేతల్లో చీమకుట్టినట్టు కూడా లేదంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో కాంగ్రెస్‌దే రాజ్యం అన్నట్లు ఉండేది. ఇప్పుడు ఆ సందడే లేదు. ఎన్నికలు వస్తాయి.. పోతాయి అన్నట్లు నాయకుల వైఖరి ఉందని గుసగుసలాడుకుంటున్నారు.
అభ్యర్థులను ఎంపిక చేస్తే సరిపోతుందా…?
గత ఎన్నికలలో చేసిన పొరపాట్లే కాంగ్రెస్ పార్టీ మళ్లీ చేస్తుందన్నది ఆ పార్టీ నేతల వాదన. ఉన్న వారిని సమన్వయ పరిచే పరిస్థితి కానరావడం లేదు. షెడ్యూల్ వచ్చాక అభ్యర్థులను ఎంపిక చేస్తే సరిపోతుందనే యోచనలో ఉన్నట్టుగా ముందు నుంచీ చెప్పుతున్నా… ఇప్పుడు అదే నిజమైంది. కళ్లముందు లోపాలు కనిపిస్తున్నా దిద్దుబాటు చర్యలు లేవని పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా… జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, ముషీరాబాద్, నాంపల్లి, మలక్‌పేట్‌లకు మాత్రమే ఇంఛార్జ్‌లు ఉన్నారు. ఇలాంటి సమయంలో మిగతాచోట్ల కాంగ్రెస్‌ను పట్టించుకునేది ఎవరనేది పార్టీలో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కానీ గ్రేటర్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత రాష్ట్ర నేతలను స్థానిక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నియమించింది. ఇప్పుడు వీరేం చేయాలనేది అంతు చిక్కని ప్రశ్న
మేయర్ అభ్యర్థి లేరు..
సాధారణంగా గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయంటే తమను మేయర్ క్యాండిడేట్‌గా ప్రకటించాలని సిటీ లీడర్లు సీనియర్ నేతల చుట్టూ చక్కర్లు కొడుతారు. ఈసారి కాంగ్రెస్‌లో అలాంటి ఊసే లేదు. మేయర్ అభ్యర్థిగా అనౌన్స్ అయితే కొందరు కార్పొరేటర్లనైనా గెలిపించుకోవాల్సి వస్తుందని, పార్టీ కోసం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని భావించి చాలా మంది అందుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది . గ్రేటర్ లో గెలుపుపై అనుమానంతోనే వాళ్లు ముందుకు రావడం లేదన్న చర్చ నడుస్తోంది .
గ్రేటర్‌తో ఇక ఖేల్ ఖతమేనా..?
గ్రేటర్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగు కానుందని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల్లోనే పార్టీ తప్పటడుగులు వేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో అదే కొంప ముంచినట్లు ఉత్తమ్‌పై మండిపడ్డారు. అయితే రాష్ట్రంలో ఉత్తమ్‌ను మార్చితేనే పార్టీ బాగుపడుతుందంటూ బహిరంగ విమర్శలు చేసినవారు కోకొల్లలు. ఇప్పడు కూడా అదే పంథా మొదలైంది. గ్రేటర్లో కనీసం గట్టి పోటీ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేనట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి సమయంలో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ నుంచి అభ్యర్థులను దింపి గెలిపించుకోకుంటే ఇక పార్టీ ఖతమేనని పార్టీలో చర్చ జరుగుతోంది.