ఒకరు తప్పు చేస్తే.. అందరినీ అలానే చూడొద్దు : అక్షయ్

by Shyam |
ఒకరు తప్పు చేస్తే.. అందరినీ అలానే చూడొద్దు : అక్షయ్
X

దిశ, వెబ్‌డెస్క్ :
బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపింది. నెపోటిజాన్ని తెరపైకి తెచ్చింది. మొత్తంగా బాలీవుడ్‌ను రెండు వర్గాలుగా చీల్చి, ఎన్నో చీకటి కోణాలను వెలికి తీసింది. చినికి చినికి గాలి వాన అయినట్లు.. అది కాస్త ముదిరి.. డ్రగ్స్ కేసు వరకు లాక్కొచ్చింది. తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఇప్పుడు ఆ కేసు అన్ని పరిశ్రమలను ఓ ఊపు ఊపేస్తోంది. అయినా సినీ పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి నోరు విప్పడం లేదు. ఇది ఇలానే కొనసాగితే.. బాలీవుడ్ ఉనికికే ప్రమాదం వాటిల్లే చాన్స్ ఉంది. అందుకే, తన మనసులోని మాటలను పంచుకోవడానికి బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఓ వీడియోను విడుదల చేశాడు.

‘ఎన్నో రోజుల నుంచి తన మనసులోని భావాలను పంచుకోవాలనుకుంటున్నాను. కానీ ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అందుకే కొన్ని రోజులుగా మౌనంగా ఉండిపోయాను. ఈ రోజు ప్రజలందరితో మాట్లాడాలని వచ్చాను’ అంటూ అక్షయ్ ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.

‘చాలా బరువెక్కిన హృదయంతో ఈ రోజు మాట్లాడుతున్నాను. మమ్మల్ని ఇప్పటికీ స్టార్స్‌ అనే పిలుస్తున్నారు. బాలీవుడ్‌‌ను మీ ప్రేమతో ఆదరించారు. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పరిశ్రమ మాత్రమే కాదు. సినిమా అనే మాధ్యమం ద్వారా భారతీయ విలువలను, సంస్కృతిని, అలవాట్లను ప్రపంచంలోని ప్రతి మూలకు ప్రచారం చేస్తున్నాం. దేశంలోని ప్రజల సెంటిమెంట్లను సినిమాలు ప్రతిబింబిస్తాయి. ప్రేక్షకులు ఎవరైనా సరే.. పేదలు, ధనవంతులు, మేధావులు తమ తమ కోణాల్లో సినిమాను చూసి అభిమానించారు. ఇప్పుడు మీకు కోపం వచ్చింది. దాన్ని కూడా మేం అంగీకరిస్తాం. అయితే, సుశాంత్‌ మృతి తర్వాత ఎన్నో విషయాలు మన ముందుకొచ్చాయి. అవి మమ్మల్ని ఎంతగా భయపెట్టాయో, మిమ్మల్ని కూడా అంతే భయపెట్టాయి. అందర్నీ బాధపెట్టాయి కూడా. ప్రస్తుతం బాలీవుడ్‌ అంటే డ్రగ్స్, నార్కోటిక్స్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సీరియస్ అంశాల మీద మాట్లాడాల్సిన అవసర ఎంతైనా ఉంది. నా మనసు మీద చేయి వేసుకుని.. ఇక్కడ అంతా బాగుంది.. ఇలా జరగలేదని అబద్ధం చెప్పలేను. అన్ని రంగాల్లో ఉన్నదే ఇక్కడ కూడా ఉంది. అయితే ఒక వ్యవస్థలో కొందరు మాత్రం తప్పు చేస్తారు. దానికి వ్యవస్థ మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదు.

డ్రగ్స్‌ విషయంలో విచారణలు జరుగుతున్నాయి. న్యాయ, చట్ట వ్యవస్థలు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అది కరెక్టే అవుతుందని బలంగా నమ్ముతున్నాను. సినిమా ఇండస్ట్రీలోని ప్రతి వ్యక్తి దీనిని నమ్మి, సహకరించాలని కోరుతున్నాను. అలాగే నా చేతులు జోడించి వేడుకుంటున్నా.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకే దృష్టితో చూడకండి. అందరినీ దోషులుగా భావించకండి. అలా చూడటం కరెక్ట్ కాదు. అది తప్పు’ అని అక్షయ్‌ ఈ వీడియోలో పేర్కొన్నారు.

https://www.instagram.com/p/CF4VdbWn7Ng/

Advertisement

Next Story

Most Viewed