అకాలీ దళ్ చీఫ్ అరెస్ట్

by Shamantha N |
అకాలీ దళ్ చీఫ్ అరెస్ట్
X

ఛండీగడ్: పంజాబ్ ప్రతిపక్ష నేత, శిరోమణి అకాలీ దళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. శివన్‌లోని సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నివాసం ఎదుట ఆయన భారీ నిరసన చేపట్టారు. అకాలీ దళ్, బీఎస్‌పీ కార్యకర్తలు, నేతలు ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం స్కాముల ప్రభుత్వంగా మారిందని సుఖ్‌బీర్ సింగ్ ఆరోపించారు. అవినీతితో కూడిన పథకాలనే ప్రారంభించి అమలు చేస్తున్నదని విరుచుకుపడ్డారు. తుఫాను పెల్లుబికినప్పుడు ఆపడం కెప్టెన్ తరం కాదని వ్యాఖ్యానించారు. టీకా పంపిణీలో స్కామ్ చేశారని, ఫతేహ్ కిట్‌లోనూ స్కామ్ చేశారని, ఎస్‌సీ స్కాలర్‌షిప్‌లోనూ స్కామ్ చేశారని, రైతుల భూములు గుంజుకుంటున్నారని ఆయన ఆరోపణలు ఎక్కుపెట్టారు.

అహంకారానికి పోయిన ‘రాజా’ను మొద్దు నిద్ర నుంచి లేపడానికి వేలాదిగా అకాలీ దళ్, బీఎస్పీ వర్కర్లు ఇక్కడ ఏకమయ్యారని చెప్పారు. పంజాబ్ ప్రజలకు న్యాయం చేకూర్చడానికి నిరసనలు చేస్తున్నారని వివరించారు. ధర్నా అంతకంతకూ పెరుగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులపై వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ సహా పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed