- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కన్నపేట ఏకే-47 పోలీసులదేనా..?
అక్కన్నపేటలో జరిగిన పోలీసు కాల్పుల్లో వాడిన ఏకే 47 తుపాకీ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది. నాలుగేళ్ళ క్రితం హుస్నాబాద్‌లో మిస్సయిన తుపాకీ, ఇప్పుడు పేలిన తుపాకీ ఒక్కటేనా? పోలీసు శాఖలో ఉండాల్సిన తుపాకీ సామాన్యుడి చేతికి ఎలా చిక్కింది. అయితే పోలీసులు వాడాలి లేదా మావోయిస్టులు వాడాలి… కానీ ఒక గొర్ల కాపరిగా ఉన్న వ్యక్తి దగ్గరికి ఎలా వచ్చింది. తుపాకీతో పాటు తూటాలు కూడా ఎలా వచ్చాయి? రెండు రౌండ్లు కాల్చడంతో కింద పడిపోయిన బుల్లెట్ షెల్ నెంబర్లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. గతంలో హుస్నాబాద్‌లో మిస్సయిన ఏకే 47 నెంబర్‌ను పరిశీలిస్తున్నారు. నిజంగా ఈ తుపాకీ పోలీసు శాఖకు చెందినదేనా? లేక కాల్పులు జరిపిన వ్యక్తి గతంలో పీపుల్స్‌వార్ పార్టీలో పనిచేసినందున అక్కడి నుంచి తెచ్చుకున్నదా?… ఇలాంటి అనేక సందేహాలు పోలీసులకు సవాలుగా మారాయి.
అక్కన్నపేట మండల కేంద్రంలో ఇంటి ప్రహరీగోడ నిర్మాణంలో సదానందం, గంగరాజు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య దీర్ఘకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇది తారాస్థాయికి చేరడంతో సంయమనం కోల్పోయిన సదానందం ఇంతకాలం ఇంట్లో భద్రంగా దాచుకున్న ఏకే 47 తుపాకిని బైటకు తీశాడు. రాత్రి సమయంలో గంగరాజు ఇంటికి వెళ్ళి కిటికీ గుండా రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ సదానందం మాత్రం భయంతో తుపాకీని తన వెంట తీసుకుని పారిపోయాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతకాలం ఇంట్లో ఏకే 47 తుపాకీ ఉంటే చుట్టుపక్కలవారికి కూడా అర్థం కాకుండా సదానందం తీసుకున్న జాగ్రత్తలు పోలీసుల్ని ఇప్పుడు విస్మయానికి గురిచేసింది. దీర్ఘకాలం వాడకుండా ఉంటే తుపాకీ పేలకుండా మొరాయిస్తుంది. కానీ కాల్చడానికి ముందే దానికి అవసరమైన మరమ్మత్తులు చేసుకున్నాడా?.. ఇలాంటి అనుమానాలు నివృత్తి కావాల్సి ఉంది.
హుస్నాబాద్‌లో నాలుగేళ్ళ క్రితం మిస్సయిన ఏకే 47
హుస్నాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.భూమయ్యపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నప్పుడు ఒక ఏకే-47 తుపాకీ గల్లంతైంది. ఆయనకు ఆ సమయంలో గన్‌మెన్‌గా ఉన్న ఇద్దరిలో ఒకరికి ఏకే-47 తుపాకీ ఉండేది. అయితే దాన్ని జిల్లా కేంద్ర పోలీసు కార్యాలయంలో జమ చేయలేదని, అప్పటి నుంచి అది మిస్సింగ్‌గానే ఉండిపోయిందని పోలీసు వర్గాల సమాచారం. ఇప్పుడు పేలిన తుపాకీ అదే అయ్యి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి గతంలో పీపుల్స్‌వార్ పార్టీలో పనిచేసి లొంగిపోయినందున అజ్ఞాతం నుంచి తెచ్చుకున్నది కావచ్చన్న అనుమానమూ ఉంది. దర్యాప్తులోనే ఈ సందేహాలకు సమాధానం లభించనుంది. అయితే హుస్నాబాద్‌లో మిస్సయిన ఏకే-47పై రెండు రకాల వాదనలు ఉన్నాయి. అప్పటి పోలీసు కమిషనర్‌గా ఉన్న శివకుమార్ ఉద్దేశపూర్వకంగానే తనను వేధింపులకు గురిచేశాడని, ఏకే తుపాకి మిస్సయిందంటూ ఆరోపణలు చేశారని సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న భూమయ్య అప్పట్లోనే ఆరోపించారు. ఏకేను అప్పగించినా దాన్ని మిస్సింగ్‌గా చూపించి తనను బలిపశువు చేయాలనుకున్నారని ఆరోపించారు. కానీ పోలీసులు మాత్రం ఆ తుపాకీని డిపాజిట్ చేయనేలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ వివాదం కూడా మరోసారి తెరమీదకు వస్తోంది.
ఇంతకూ సదానందం కాల్చింది పోలీసులు వాడే ఏకే 47 తుపాకీయా? లేక పీపుల్స్‌వార్ (మావోయిస్టు పార్టీ) స్వాధీనంలో ఉన్న తుపాకీయా? నిజంగా నాలుగేళ్ళుగా డిపార్టుమెంటుకు చెందిన ఏకే తుపాకీ మిస్సయితే ఆ శాఖ ఉన్నతాధికారులు ఎందుకు సైలెంటుగా ఉండిపోయారు. ఒక తుపాకీ మిస్సయిపోతే దాన్ని వాడే పోలీసుపై యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? అప్పుడు మిస్సయిన తుపాకీ నెంబరుతో పాటు దానికి కేటాయించిన బుల్లెట్ల నెంబర్లు పోలీసు అధికారుల దగ్గర ఉంటాయి. ఇప్పుడు పేలిన తూటా షెల్ నెంబర్ కూడా అదేనా? వీటినిబట్టి ఆ తుపాకీ సంగతి తేలిపోతుంది. ఒక గన్‌మాన్ దగ్గర ఉండాల్సిన తుపాకీ నిజంగా సదానందం చేతికి చిక్కినట్లయితే వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? గన్‌మాన్ దగ్గర తుపాకీ మిస్సయినప్పుడు మొత్తం ఎన్ని తూటాలు ఉన్నాయి? నిజంగా ఆ తుపాకీయే అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లయితే సదానందం రెండు రౌండ్లు పేల్చగా ఇంకా ఎన్ని తూటాలు (లైవ్) ఉన్నాయి తదితర వివరాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉంది.
‘రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి డిజిటల్ ఫుట్ ప్రింట్ మా దగ్గర రెడీగా ఉంది’ అని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఏడాది క్రితం ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏకే తుపాకీతో కాల్పులు జరిపిన సదానందం కదలికలను పోలీసులు ఇంతకాలం పసిగట్టలేకపోయారా? పారిపోయిన తర్వాత ఎటువైపు వెళ్ళిపోయారో ఆయన మొబైల్ టవర్ సిగ్నల్స్ లేదా జీపీఎస్ ద్వారా పసిగట్టలేకపోయారా? సదానందం మొబైల్‌లో ఇటీవలి కాలంలో ఎవరెవరితో మాట్లాడారో తెలియలేదా?… ఇలాంటి అనేక ప్రశ్నలతో పాటు తుపాకీ సంగతిని పోలీసులు తేల్చాల్సి ఉంది. ‘ఆడపిల్ల వంక చూడాలంటే లాగు తడవాలి… గుడ్లు పీకుతాం…’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. కానీ అత్యాచారాలు, హత్యలు, సామూహిక అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ‘తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది.. పోలీసుల నిఘాతో ప్రజలు కంటి నిండా నిద్రపోతున్నారు..’ అని కూడా వ్యాఖ్యానించారు. కానీ తుపాకీ కాల్పులు జరిగిపోతున్నాయి.