ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త!

by Shamantha N |   ( Updated:2020-04-18 09:09:54.0  )
ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి కారణంగా దేశీ, విదేశీ విమాన సర్వీసులను గత నెల నుంచి కేంద్రం నిలిపేసింది. గత వారం ఏప్రిల్ 14 నుంచి మొదలవుతాయని భావించి కొందరు టికెట్లను సైతం బుక్ చేసుకున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగించారు. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న వారంతా నిరాశచెందారు. కరోనా వ్యాప్తి ఇలాగే కొనసాగితే విమాన సర్వీసులు మే 3 తర్వాతైనా మొదలవుతాయా లేదా అనే అనుమానం ప్రయాణికుల్లో ఉంది. ఈ అంశంలో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా స్పష్టత ఇచ్చింది. కొన్ని విమాన సర్వీసులకు సంబంధించి డొమెస్టిక్ సర్వీసులకు మే 4 నుంచి బుకింగ్స్ మొదలవుతాయని ప్రకటించింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను జూన్ 1 నుంచి ప్రారంభిస్తామని స్పష్టత ఇచ్చింది. మే 4 నుంచి మొదలయ్యే బుకింగ్స్ ఏ ఏ నగరాలకు ఇవ్వనున్నది వివరాలను చెప్పలేదు. త్వరలో వాటిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

లాక్‌డౌన్ సమయంలో విమాన ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్న వారికి రద్దైన టికెట్ల సొమ్మును తిరిగివ్వాలని రెండ్రోజుల ముందు డిప్యూటీ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), ప్రభుత్వం, ప్రైవేట్ విమానయాన సంస్థలకు ఆదేశాలిచ్చింది. లాక్‌డౌన్ సమయంలో ప్రయాణానికి కొందరు డొమెస్టిక్, అంతర్జాతీయ టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే, లాక్‌డౌన్ కారణంగా విమాన సర్వీసులన్నీ రద్దవడంతో రీఫండ్ చెల్లింపుల్లో అభ్యంతరాలు ఏర్పడ్డాయి. సర్వీసు ఛార్జీలు, మరికొన్ని కటింగ్స్ చేస్తామని ఎయిర్‌లైన్స్ నిర్ణయించినప్పటికీ డీజీసీఏ మూడు వారాల్లోగా ఫుల్ రీఫండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags: air india, coronavirus, covid-19, domestic flights, flight bookings, international flight, lockdown, travel ban

Advertisement

Next Story