మజ్లిస్ పార్టీ వ్యూహాత్మక మౌనం.. మళ్లీ ప్లాన్ చేశారా..?

by Anukaran |
మజ్లిస్ పార్టీ వ్యూహాత్మక మౌనం.. మళ్లీ ప్లాన్ చేశారా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తి పుట్టిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ‘నమ్మకమైన మిత్రపక్షం’గా వ్యవహరించిన మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం మద్దతు ఇవ్వడంపై సైలెంట్‌గా ఉంది. బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో పీవీ నర్సింహారావుకు వ్యతిరేక వైఖరి తీసుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఆయన కుమార్తెకు మద్దతు ఇస్తుందా? లేక వ్యతిరేకంగా ఉంటుందా? టీఆర్ఎస్‌ను కాదనుకుని ఏ అభ్యర్థివైపు మొగ్గు చూపుతుంది? ఆ పార్టీ కేడర్‌కు, ఓటర్లుగా ఉండే గ్రాడ్యుయేట్ అభిమానులకు ఏ స్పష్టత ఇస్తుంది? ఒకవేళ వాణిదేవికి ఓటు వేసేది లేదనే నిర్ణయమే తీసుకుంటే ప్రత్యామ్నాయంగా ఎవరికి మద్దతు ఇవ్వాలనే సందేశాన్ని పంపుతుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలు పార్టీల్లో, ఓటర్లలో ఆసక్తి రేకెత్తిస్తోంది.

దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు నిర్వహిస్తోంది. ఆయనకు ‘భారతరత్న’ ఇవ్వాలని అధికార పార్టీ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఆ తీర్మానాన్ని బహిరంగంగా వ్యతిరేకించకపోయినా దూరంగా ఉండిపోయింది. బాబ్రీ మసీదు కూల్చివేత మొదలు పీవీ పట్ల మజ్లిస్ పరాటీ వ్యతిరేక అభిప్రాయాన్నే కలిగి ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం ఆయన సమాధిని కూల్చివేస్తామని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇప్పటికీ ఆ పార్టీకి పీవీ పట్ల ఉన్న అభిప్రాయం మారలేదు.

టీఆర్ఎస్‌తో దోస్తీ.. అభ్యర్థిపై వ్యతిరేకత

మరోవైపు మేయర్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్‌కు మద్దతు పలికింది. ఏ ఎన్నికలైనా ఈ రెండు పార్టీలూ నమ్మకమైన మిత్రపక్షాలుగానే ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కుమార్తె వాణీదేవిని టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టడంతో మజ్లిస్ ఎటూ తేల్చుకోలేకపోయింది. మద్దతు ఇవ్వడాన్ని ఆ పార్టీ సైద్ధాంతికంగానే వ్యతిరేకిస్తోంది. టీఆర్ఎస్ పట్ల మజ్లిస్‌కు స్నేహమే ఉన్నా ఎమ్మెల్సీ అభ్యర్థి పట్ల మాత్రం వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలి? ఏ అభ్యర్థిని బలపర్చాలి? ఓటు ఎవరికి వేయాలి. అన్న విషయాల్లో పార్టీ శ్రేణులకు, ఓటర్లకు మజ్లిస్ పార్టీ ఇవ్వనున్న క్లారిటీ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అసలు అలాంటి క్లారిటీ ఇస్తుందా? లేక పోలింగ్ సమయం వరకూ మౌనంగానే ఉండిపోతుందా? లేక ఆత్మసాక్షిగా ఓటు వేయాలంటూ పిలుపునిస్తుందా? ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి.

కాంగ్రెస్‌కు లాభమా?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దెబ్బతిన్న టీఆర్ఎస్ తన బలాన్ని ఈ ఎన్నికల్లో సమీకరించుకోవడం ద్వారా పూర్వ స్థితికి చేరుకోవాలనుకుంటోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లిం గ్రాడ్యుయేట్ ఓటర్ల సంఖ్య గణనీయంగానే ఉంది. సహజంగా మజ్లిస్ పార్టీవైపు ఉండే ఈ ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారన్నది కీలకంగా మారింది. పీవీ పట్ల ఉన్న వ్యతిరేకతతో ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న వాణీదేవికి ఓటు వేస్తారా? అనేది చర్చనీయాంశం. బీజేపీ అభ్యర్థివైపు మొగ్గు చూపడమూ కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో సెక్యులర్ పార్టీ అనే ముద్రపడిన కాంగ్రెస్ అభ్యర్థికి లాభిస్తుందేమోననే గుసగుసలు మొదలయ్యాయి. లేదా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ లేదా ఇతరులకు ఓటు వేస్తారా అనేది కూడా స్పష్టత లేకుండా ఉంది.

ఆ వైరం ఎమ్మెల్సీ ఎన్నికల వరకేనా?

టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు ఆ పార్టీతో స్నేహాన్ని కొనసాగిస్తున్న మజ్లిస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రమే అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నది. ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీని ఇరుకున పెట్టడానికి పీవీ కుమార్తెను టీఆర్ఎస్ బరిలోకి దింపింది. ఈమెను నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పీవీ అభిమానులను కూడా ఆకర్షించవచ్చనే వ్యూహాత్మక అడుగు వేసింది. అదే సమయంలో మజ్లిస్ పార్టీకి ఆగ్రహం కలిగించడానికి దారితీసింది. ఎప్పుడూ సహకారం ఇచ్చిన మజ్లిస్ బహుశా దూరంగా ఉండడం ఇదే మొదటిసారి. ఈ దూరం ఎమ్మెల్సీ ఎన్నికల వరకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా ముమ్మరం ప్రచారం చేస్తున్నారు.

మంత్రి మహమూద్ ఆలీ కూడా మజ్లిస్‌కు పట్టు ఉన్న ఆజంపురలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కానీ మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ పార్టీ తరఫున ఎవ్వరినీ ఆహ్వానించలేదు. మజ్లిస్ నుంచి మద్దతు ఉండదనే క్లారిటీ రావడంతోనే టీఆర్ఎస్ ఒంటరిగా ప్రచారం చేసుకుంటోందనే చర్చలు మొదలయ్యాయి. అభ్యర్థిని ఖరారు చేయడానికి ముందే మజ్లిస్‌ నేతలతో ఈ విషయాన్ని కేసీఆర్ చర్చించి ఉంటారేమో అని టీఆర్ఎస్ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. మజ్లిస్ సహకారం లేకపోవడం టీఆర్ఎస్‌కు కలిసొస్తుందా? లేక చేటు చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. అంతిమంగా కాంగ్రెస్‌కు బెనిఫిట్ అవుతుందా అనే చర్చలు కూడా జరుగతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed