మిర్చి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి: AIKS డిమాండ్

by Sridhar Babu |
మిర్చి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి: AIKS డిమాండ్
X

దిశ, భద్రాచలం : తెగుళ్ళు సోకి మిర్చి పంట నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) డిమాండ్ చేసింది. రైతు సంఘ ప్రతినిధులు శుక్రవారం చర్ల మండలంలో పర్యటించి వైరస్ బారినపడిన మిర్చి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తామర, నల్లనల్లి, ఎర్రనల్లి వంటి వైరస్‌ల నుంచి మిర్చి తోటలు కాపాడటానికి రైతులు 40 నుంచి 60 సార్లు మందులు పిచికారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రైతులు గగ్గోల పెడుతున్నారని అన్నారు. ఇప్పటికే మిర్చి తోటలకు రైతులు ఎకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టారని తెలిపారు. చేతికి వచ్చిన పంట వైరస్‌ల వలన బుగ్గిపాలు అయిందన్నారు. వైరస్‌లను అరికట్టటానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘ నాయకులు విమర్శించారు

వేలాది మంది రైతులకు చెందిన లక్షల ఎకరాల మిర్చి పంట నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిని ప్రకృతి విపత్తుగా పరిగణించి పరిహారం ప్రకటించాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనాలను తయారుచేసి ప్రభుత్వానికి నివేదించాలన్నారు. మిర్చి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం కోసం ఈ నెల 27న కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో మిర్చి రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మిర్చి తోటలను పరిశీలించిన ప్రతినిధి బృందంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యలమంచిలి రవికుమార్, ధర్మా, జిల్లా సహాయ కార్యదర్శి అన్నవరం సత్యనారాయణ, చర్ల మండల కార్యదర్శి చీమలమర్రి మురళి, జిల్లా కమిటీ సభ్యులు బొల్లి సూర్య చందర్ రావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed