థర్డ్ వేవ్.. పిల్లలకు ముప్పని చెప్పలేం : ఎయిమ్స్ చీఫ్

by Shamantha N |
AIIMS Chief Dr. Randeep Guleria
X

న్యూఢిల్లీ: థర్డ్ వేవ్‌‌తో పిల్లలకు ముప్పు అని జరుగుతున్న చర్చను ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా కొట్టిపారేశారు. తదుపరి వేవ్ పిల్లలపై ప్రభావం వేస్తుందని చెప్పడం తప్పుడు సమాచారమేనని అన్నారు. పిల్లలకే సీరియస్ ముప్పు ఉంటుందనడానికి డేటా లేదని, జాతీయ, అంతర్జాతీయంగానూ ఆ వాదనను బలపరిచే ఆధారాల్లేవని స్పష్టం చేశారు. మనదేశంలోనూ సెకండ్ వేవ్‌లో పిల్లల్లో సీరియస్ ఇన్ఫెక్షన్ లేదని వివరించారు. ప్రపంచవ్యాప్తంగానూ కొత్త వేవ్‌లలో ప్రత్యేకించి పిల్లలకు ఎక్కువ ముప్పు ఉన్నట్టు తెలిపే సమాచారమేమీ లేదని పేర్కొన్నారు. భారత్‌లో కరోనా బారిన పడి హాస్పిటల్‌లో చేరిన పిల్లల్లో దాదాపు 60 శాతం నుంచి 70శాతం వరకు కొమార్బిడిటీస్ కలిగి ఉన్నవారేనని, లేదా కీమోథెరపీ, లేదా రోగనిరోధక శక్తి అత్యల్పంగా ఉన్నవారని తెలిపారు. ఆరోగ్యవంతులైన పిల్లల్లో కరోనా వచ్చినప్పటికీ హాస్పిటల్‌లో చేరకుండానే నయమైందని వివరించారు.

కొవిడ్ నిబంధనల పాలనతోనే వేవ్‌లకు అంతం

సాధారణంగా మహమ్మారుల్లో మళ్లీ మళ్లీ వేవ్‌లు రావడం చూడవచ్చునని, రెస్పిరేటరీ వైరస్‌లలో ఈ వేవ్‌లను గమనించవచ్చునని డాక్టర్ గులేరియా వివరించారు. 1918 స్పానిష్ ఫ్లూ సెకండ్ వేవ్ సీరియస్‌గా వచ్చిందని, మళ్లీ థర్డ్ వేవ్ వచ్చినా, చాలా తక్కువ మందిపైనే ప్రభావ వేసిందని చెప్పారు. రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యం తక్కువ ఉన్నప్పుడే తరుచూ వేవ్‌లు వస్తాయని, చాలా మంది టీకా తీసుకుని వైరస్ రుతువుల వారీగా వచ్చే వ్యాధిలా మిగిలిపోతుందని తెలిపారు. మ్యుటేషన్స్‌తోనూ వైరస్ వ్యాపించే అవకాశముంటుందని, అలాగే, ప్రజలు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనూ వ్యాప్తి చెందుతుందని వివరించారు. కాబట్టి, మెజార్టీ ప్రజలు టీకా వేసుకునే వరకూ కొవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా కరోనాను తుదముట్టించవచ్చునని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed