అర్బన్ విద్యార్థులకు అగ్రి సీట్లు

by Shyam |
Professor Jayashankar Agricultural University
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ, అగ్రిఇంజనీరింగ్, ఆర్గానిక్ డిప్లొమా కోర్సుల్లో అర్బన్ విద్యార్థులకు కూడా సీట్లు కేటాయిస్తున్నట్టుగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించింది. వ్యవసాయ కోర్సుల ప్రవేశాల అర్హతల్లో సడలింపులు చేస్తున్నట్టుగా రిజిస్ట్రర్ సుధీర్ కుమార్ తెలిపారు. విశ్వవిద్యాలయం అకాడమిక్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు.

గతంలో కేవలం గ్రామీణ ప్రాంతాలలో చదివిన విద్యార్థులకు, నాలుగేళ్ల పాటు తప్పక గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలనే నిబంధనలతో సీట్లు కేటాయించమని తెలిపారు. ఈ ఏడాది నుంచి 60 శాతం సీట్లు గ్రామీణ విద్యార్థులకు, 40 శాతం సీట్లను గ్రామీణ, అర్బన్ విద్యార్థులతో భర్తీచేయాలని నిర్ణయించినట్లు రిజిస్ట్రర్ తెలిపారు. నాలుగేళ్ళపాటు గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులు మాత్రమే గ్రామీణ కోటాకు అర్హులని స్పష్టం చేశారు.

వీటితో పాటు గతంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు మాత్రమే అర్హులు కాగా, ఇక మీదట ఇంటర్ చదివిన విద్యార్థులు కూడా అర్హులుగా ప్రకటించారు. పాలిట్‌లో ర్యాంకు పొంది మెరిట్ సాధిస్తే డిప్లొమాలో ప్రవేశాలకు అనుమతిస్తామన్నారు. వయో నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేపట్టలేదని, 15 నుంచి 22 ఏళ్ళలోపు వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.

Advertisement

Next Story