జనతా కర్ఫ్యూ.. లాక్‌డౌన్‌కు నాందీ?

by Shamantha N |   ( Updated:2020-03-21 08:12:46.0  )
జనతా కర్ఫ్యూ.. లాక్‌డౌన్‌కు నాందీ?
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాలోని హుబెయి ప్రావిన్స్‌లో విజృంభించిన కరోనావైరస్‌ను అడ్డుకునేందుకు ఆ దేశ సర్కారు ప్రావిన్స్ మొత్తాన్ని లాక్‌డౌన్ చేసింది. ప్రావిన్స్‌లోని నగరాల మధ్యా రవాణాను నిలిపేసింది. కరోనా కట్టడికి ఈ లాక్‌డౌన్ దోహదపడిందని నిపుణులు తెలిపారు. ఇటువంటి చర్యలే ఒక వారం ముందుగా తీసుకుని ఉంటే చైనా.. మొత్తం బాధితుల కేసుల్లో సుమారు 60శాతం కేసులను నివారించి ఉండేదని అంచనా వేశారు. ఈ ప్రక్రియనే పలుదేశాలు పాటించేందుకు సిద్ధమయ్యాయి. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బెల్జియం లాంటి దేశాలు ఇప్పటికే లాక్‌డౌన్ చేసి కరోనాను అడ్డుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా అటువైపుగా అడుగులు వేస్తున్నదా? అనే చర్చ జరుగుతున్నది.

ఆదివారం 14 గంటలపాటు ప్రజలందరూ స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోడీ గురువారం పిలుపునిచ్చారు. ఒక్కరోజు నిర్బంధంతోనే కరోనావైరస్‌ను కట్టడి చేయలేకపోవచ్చు. కానీ, ఎంతోకొంత మేలైతే తప్పకుండా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధింపునకు ఇదొక ట్రయల్ అనీ మరికొందరు వాదిస్తున్నారు. మరి నిజంగానే లాక్‌డౌన్ విధించే దశకు పరిస్థితులు దిగజారాయా? అనే అనుమానాలు రావడంతో తప్పేమీ లేదు. దీనికి సమాధానంగా వేగంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను చూపిస్తున్నారు. దేశంలో కేవలం వారం వ్యవధిలోనే కరోనా కేసులు రెట్టింపును దాటాయి. శుక్రవారం ఒక్కరోజే 63 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం కూడా ఈ సంఖ్య 60ని దాటింది. శుక్రవారం కంటే ఎక్కువగానే నమోదయ్యే అవకాశమున్నది. రోజుకు ఒకటి, రెండు కేసుల నుంచి ఈ రెండు రోజుల్లో(శుక్ర, శని) వెలుగుచూసిన సరాసరి పాజిటివ్ కేసుల సంఖ్య 60కి చేరడం ఆందోళన కలిగిస్తున్నది.

ఇదిలా ఉండగా.. కరోనావైరస్‌ను తేల్చే పరీక్షలను భారత్ సరిపడా నిర్వహించడం లేదన్న విమర్శలున్నాయి. వాస్తవంగా కరోనా బాధితుల సంఖ్య ఇంకాస్త అధికంగానే ఉండే అవకాశమున్నదన్న వాదనలూ ఉన్నాయి. కేవలం విదేశీ పర్యటన చరిత్ర ఉండి కరోనా లక్షణాలున్నవారికి, బాధితులతో కాంటాక్ట్ అయినవారికి, బాధితులకు చికిత్స చేసి లక్షణాలు వెలుగుచూసినవారికి మాత్రమే పరీక్షలు నిర్వహించే వ్యూహాన్ని భారత్ అనుసరించింది. తాజాగా, ఈ పరిధి పెంచుతూ న్యూమోనియా, తీవ్ర దగ్గు, శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవారికి కరోనావైరస్ టెస్టులు జరపాలని నిర్ణయించింది. దీంతో కరోనా కేసులు మరిన్ని వెలుగుచూసే అవకాశమున్నదని తెలుస్తున్నది. ఎందుకంటే కరోనా.. చాపకింది నీరులా వేగంగా వ్యాపించే వైరస్. విస్తృతంగా పరీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకుంటే గానీ దాన్ని నివారించలేం. ఇప్పటికే విస్తృతంగా పరీక్షలు చేపట్టాల్సిందని, వెలుగుచూడని కరోనాకేసులు అధికంగానే ఉండొచ్చని కొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నాయి. మరికొన్ని ప్రధాని పిలుపునిచ్చిన కర్ఫ్యూ నుంచి ఆంక్షలను మొదలుపెడుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ప్రధాని ప్రకటించిన 14 గంటల(ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు) కర్ఫ్యూను 24 గంటలకు పొడిగించింది. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు బంద్ పాటించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎమర్జెన్సీ సేవలు మినహా అన్నీ బంద్ అని ప్రకటించారు. కాగా, ఒడిషాలోని 40శాతం భూభాగంలో వారం రోజులపాటు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గోవా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు పంపింది. కర్ణాటక ధార్వాడ్ జిల్లాలో ఈ నెల 31వరకు 144 సెక్షన్ అమలులో ఉండనున్నట్టు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాజస్తాన్‌లోని ఝుంఝును జిల్లాలోనూ 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది.

అనేక రాష్ట్రాలు విద్యార్థుల పరీక్షలను వాయిదా వేశాయి. సినిమా హాల్స్, పబ్‌లు, థియేటర్లు, రెస్టారెంట్‌లపై నిషేధాజ్ఞలు విధించాయి. పంజాబ్‌లో 50 మందికి మించి గుమిగూడొద్దన్న ఆదేశాలు వచ్చాయి. ఢిల్లీలోనైతే ఐదుగురికి మించి మంది ఒకచోట చేరొద్దని సీఎం ఆదేశించారు. అంతేకాదు, భవిష్యత్తులో అవసరమైతే ఢిల్లీ లాక్‌డౌన్ కూడా చేసే అవకాశమున్నట్టు తెలిపారు. తెలంగాణ సర్కారూ కర్ఫ్యూను 24 గంటలకు పొడిగించడంతో.. ఇదే బంద్‌ను వారంపాటు కొనసాగిస్తారా? అనే అనుమానాలూ వెలువడుతున్నాయి. ఈ పరిణామాలు దేశం లాక్‌డౌన్ వైపుగా ప్రయాణిస్తున్నదనడానికి సంకేతాలని చర్చిస్తున్నారు. ఈ లాక్‌డౌన్‌కు ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ.. నాందీ అయ్యే అవకాశమున్నదని విశ్లేషిస్తున్నారు.

Tags : coronavirus, lockdown, janata curfew, across country, shut down

Advertisement

Next Story

Most Viewed