బిర్యానీ ప్రియులకు భారీ షాక్.. ఇక తినలేరేమో!

by Anukaran |   ( Updated:2021-08-31 00:00:26.0  )
Chicken Biryani,
X

దిశ, తెలంగాణ బ్యూరో : బిర్యానీకి ఫేమస్ హైదరాబాద్. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు బిర్యానీ అంటే లొట్టలేసుకుని తింటారు. పెళ్లయినా.. పేరంటమైనా.. ఎలాంటి ఫంక్షన్ ఉన్నా హైదరాబాద్ వాసులకు బిర్యానీ ఉండాల్సిందే. అలాంటి బిర్యానీ మరింత ప్రియం కానుంది. ఆఫ్ఘాన్‌లో తాలిబన్ల ఎఫెక్ట్ దేశంతోపాటు హైదరాబాద్ పై కూడా భారీగా పడింది. అక్కడినుంచి సరుకు రవాణా జరగకపోవడంతో అక్కడి నుంచి దిగుమతి చేసుకునే సామగ్రి ధరలు భగ్గుమంటున్నాయి. దేశానికి దిగుమతయ్యే డ్రైఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు 85 శాతం ఆఫ్ఘాన్ నుంచి వచ్చేవే. అఫ్ఘాన్ సంక్షోభం భారత్ పై పడటంతో బిర్యానీలో వినియోగించే మసాలా దినుసుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో చేసేదేం లేక రెస్టారెంట్లు బిర్యానీ ధరను అమాంతం పెంచేసింది.

biryani case

అఫ్ఘాన్‌లో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల వల్ల అక్కడి నుంచి దిగుమతయ్యే సామగ్రి ధరలకు కేవలం ఒక్క నెలలోనే భారీ వ్యత్యాసం ఏర్పడింది. జూలైలో అంజీర ధర కిలోకి రూ.650 ఉంటే ఆగస్టులో రూ.900 నుంచి 1400 కు పైగా పెరిగింది. సాజీరా రూ.380 నుంచి దాదాపు రూ.600 వరకు పెరిగింది. బ్లాక్ అప్రికాట్స్ రూ.300 నుంచి రూ.700, గ్రీన్ అప్రికాట్స్ రూ.325 నుంచి రూ.750 వరకు పెరిగాయి. హైదరాబాద్‌‌లోని చాలా ప్రాంతాల్లో బిర్యానీలో డ్రైఫ్రూట్స్ వేస్తూ ఉంటారు. ఆ సరుకు దిగుమతవ్వక డిమాండ్, సప్లయ్ లో తేడాలు వచ్చి ధరలు విపరీతంగా పెరిగాయి.

హైదరాబాద్‌లో కొద్దిరోజుల క్రితం వరకు రూ.600 జంబో ప్యాక్ ఉన్న బిర్యానీ, ఇప్పుడు రెస్టారెంట్లను బట్టి రూ. 700 నుంచి రూ.800 వరకు ధరలు పెరిగాయి. రూ.400 ఉన్న ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ రూ.550 వరకు చేరుకుంది. ప్లేట్ బిర్యానీ ధర రూ.250 నుంచి రూ.350 వరకు పెరిగింది. దీనికి డెలివరీ చార్జీ, ఇతర టాక్సులు అదనం. ఇవన్నీ కలుపుకుంటే ఒక కుటుంబం కడుపునిండా బిర్యానీ తినాలంటే రూ.850 వరకు ఖర్చు చేయాల్సివస్తోంది. హైదరాబాద్‌ నగరంలో పేరున్న పెద్ద హోటళ్లు బిర్యానీ తయారీలో సగటున రోజుకు యాభై కేజీల బాదంపప్పు, అదే స్థాయిలో జీడిపప్పు, ఎండుద్రాక్షను వినియోగిస్తోంది. వీటి ధరలు అమాంతం పెరగడం వల్లే బిర్యానీ ధరలు మరింత ప్రియంగా మారాయి. కొవిడ్ కారణంగా ఏడాదిన్నరగా ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లన్నీ మూతపడ్డాయి. ఇటీవల తెరుచుకుని ఇప్పటికిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్న తరుణంలో ధరలు పెంచితే కస్టమర్లు వస్తారా లేదా అనే ఆందోళన చెందుతున్నారు. దీనికంటే ముఖ్యంగా ఆఫ్ఘాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు ఎగుమతి, దిగుమతులపై ఆంక్షలు పెట్టినా, టాక్సులు పెంచినా నిర్వాహకులకు ఇబ్బందులు తప్పేలాలేవు. దీనివల్ల సామాన్యులు బిర్యానీకి మరింత దూరమయ్యే అవకాశముంది.

Advertisement

Next Story