స్టార్ కమెడియన్ దారుణ హత్య.. ప్రజలను నవ్విస్తున్నాడని గొంతు కోసి

by Anukaran |   ( Updated:2021-07-28 06:03:55.0  )
స్టార్ కమెడియన్ దారుణ హత్య.. ప్రజలను నవ్విస్తున్నాడని గొంతు కోసి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు దారుణానికి ఒడిగట్టారు. ఆ దేశ ప్రముఖ కమెడియన్‌ నాజర్ మహమ్మద్‌ను అతి కిరాతకంగా హత్య చేశారు. ఇస్లాం కు విరుద్దంగా ప్రజలను నవ్విస్తున్నాడని అతడిని ఇంటి నుంచి లాక్కెళ్లి .. చెట్టుకు కట్టి, గొంతు కోసి హత్య చేశారు. ఈ దారుణ ఘటన ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ కమెడియన్ నాజర్ మహమ్మద్‌ కాందహార్ ప్రావిన్స్‌లో ఖాషా జ్వాన్‌గా ప్రసిద్ధి చెందారు. కమెడియన్ గా ఆయనకు మంచి పేరు ఉంది. కమెడియన్ కాకముందు కాందహార్‌ ప్రావిన్స్‌లో పోలీసు అధికారిగా విధులు నిర్వహించేవాడు. ఇక ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి కొందరు దుండగులు ఆయన ఇంటికి వెళ్లి.. గన్నులతో బెదిరించి ఆయనను కిడ్నాప్ చేశారు. అనంతరం నాజర్‌ని కారులో చిత్ర హింసలు పెట్టినట్లు ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఆ తర్వాత అతనిని గొంతు కోసి హత్య చేసినట్లు స్థానిక మీడియా తెలపడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. అయితే తాలిబాన్లే ఈ దారుణానికి ఒడిగట్టారని కమెడియన్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ప్రజలను నవ్వించినందుకే తాలిబాన్లు నాజర్ ని హత్యచేశారని, ఇస్లాం మతానికి విరుద్ధంగా నాజర్ ప్రవర్తించినందుకే అతనిని ఇంత దారుణంగా హింసించి చంపారని ప్రజలు అంటున్నారు. అయితే ఈ వార్తలపై రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ స్పందించింది. ఈ హత్యకు, తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు పేట్రేగిపోతున్నారు. ముఖ్యంగా భద్రతా బలగాలను టార్గెట్‌గా చేసుకొని మారణహోమం సృష్టిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో 70శాతం భూభాగం తమ ఆధీనంలోకి వచ్చిందని ఇటీవల ప్రకటించడంతో ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం ఈ కమెడియన్ హత్య ప్రపంచం మొత్తం వైరల్ గా మారింది.

Advertisement

Next Story