- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆధునిక యుగంలో అడవి బిడ్డల అరణ్యరోదన
దిశ, వాజేడు: దేశం రాష్ట్రం ఆధునికంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న అడవి తల్లి ఒడిలో జీవనం సాగిస్తున్న ఆదివాసీల బతుకులు మారడం లేదు. పాలకులు రోజుకో హామీ ఇస్తూ కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నా.. ఆ ఫలాలు వారి ధరి చేరడం లేదు. ఫలితంగా ఆదివాసులు అడవి తల్లి ఒడిలో అల్లాడిపోతున్నారు. అయినా వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్య వైద్యం పౌష్టికాహారం అందక వారిపై దయ చూపే నాథుడు లేక అష్ట కష్టాలు పడుతున్నారు. అడవి తల్లి బిడ్డలు అరణ్యరోదన అనుభవిస్తున్న పెనుగోలు గిరిజనులపై ప్రత్యేక కథనం..
అభివృద్ధికి నోచుకోని పెనుగోలు
వాజేడు మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కొండలపై పెనుగోలు గ్రామం ఉంది. అక్కడికి వెళ్లాలంటే సరైన రోడ్డు సౌకర్యం లేదు.. వాహనాలు తిరగవు కాలినడకన వెళ్లాల్సిందే. ఆ గ్రామం చేరుకోవాలంటే మూడు వాగులు దాటి మూడు గుట్టలు ఎక్కాలి. ఆ గ్రామానికి వెళ్లాలంటే 24 గంటల సమయం పడుతుంది.గ్రామంలో సుమారు 26 గిరిజనుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అడవిని ఆధారంగా చేసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తరతరాలుగా అక్కడే ఉండి జీవిస్తున్న గిరిజనులకు విద్య, వైద్యం, ఆహారం అందని ద్రాక్షగా మారింది. రెండు, మూడు నెలలకోసారి హెల్త్ అసిస్టెంట్ అక్కడికి వెళ్లి మందులు ఇచ్చి వస్తారు. అక్కడి వారికి జబ్బు చేసిందంటే నాటు వైద్యమే దిక్కవుతోంది.
ఆస్పత్రికి వెళ్లాలంటే జోలె కావడే..
వైద్యం కోసం రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే చీరతో జోలె కట్టి రోగిని ఇద్దరు వ్యక్తులు మోసుకెళ్లాల్సిందే. వాగులోని చెలిమ నీరే తాగునీరుగా వాడుకుంటున్నారు. రేషన్ సరుకుల కోసం ప్రతీ నెల 16 కిలోమీటర్ల దూరం కాలినడకన వాజేడు మండల పరిధిలోని గుమ్మడి గ్రామానికి వెళ్లి రేషన్ బియ్యం తీసుకెళ్తారు. వాజేడు మండల కేంద్రంలో జరిగే వారాంతపు సంతకు వచ్చి నెలకు సరిపడా సరుకులు తీసుకెళ్తారు. వర్షాకాలం వచ్చిందంటే వారి కష్టాలు వర్ణనాతీతం. గ్రామాన్ని మూడు వాగులు చుట్టుముడతాయి. బయటకు వెళ్లే దారి లేక మూడు నెలల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ జీవనం సాగించాల్సిందే.
విద్యకు దూరం
పెనుగోలు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. కానీ రెగ్యులర్ ఉపాధ్యాయులు పోస్ట్ కరువైంది. దీంతో అక్కడి విద్యార్థులకు విద్య అందకుండా పోతోంది.
పోడు వ్యవసాయమే జీవనాధారం
అడవిని నమ్ముకుని జీవించే పెనుగోలు గిరిజనులకు పోడు వ్యవసాయమే జీవనాధారం. అటవీ ప్రాంతంలో ఉన్న భూమిని సేద్యం చేస్తూ వ్యవసాయం చేసి జొన్నలు, పెసలు, మినుములు, సజ్జలు పండిస్తూ వాటిని ఆహారంగా వినియోగించుకుంటారు. వెదురు బొంగులు తెచ్చి బుట్టలు తయారు చేసి వాజేడు వారాంతపు సంతలో విక్రయిస్తుంటారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు వారి ధరిచేరక అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్నారు.
పాఠ్యాంశంలో పెనుగొండ
వాజేడు మండలం పెనుగోలు గ్రామాన్ని ఆరో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యాంశంలో చేర్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు. పెనుగోలు గ్రామాన్ని సందర్శించి అక్కడి ఆదివాసుల జీవన విధానంపై ఉన్నత అధికారులకు తెలియజేసి ఆ సారాంశం పాఠ్యపుస్తకంలో పొందుపరిచారు.
నడకదారి.. చెలిమె నీరు
పెనుగోలు గ్రామానికి నడకదారే దిక్కు. వాజేడు మండల కేంద్రం నుంచి అక్కడికి చేరాలంటే మూడు వాగులు, మూడు ఎత్తైన గుట్టలు ఎక్కాల్సి వస్తుంది. సరైన రోడ్డు మార్గం లేక కాలినడకన నానా అవస్థలు పడుతూ ఆ గ్రామం చేరుకోవాల్సిన పరిస్థితి. నేటికి ఉంది ఆ గ్రామానికి మంచినీటి సౌకర్యం లేదు. చెలిమె నీటినే తాగుతున్నారు. విద్యుత్ వెలుగులు లేక నానా అవస్థలు పడుతున్నారు. గిరిజనులకు ఇటీవల ములుగు జిల్లా కలెక్టర్ ఆదిత్య సౌర విద్యుత్ ఏర్పాటు చేయించారు. అడవి బిడ్డలను గుట్టలు దింపి మండల కేంద్రానికి దగ్గరలో నివాసాలు ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.