- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారులపై పెట్రోల్ పోసిన ఆదివాసి.. సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..!
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలో అటవీ అధికారులు, ఆదివాసీల మధ్య పోడు భూముల వివాదం సంచలనం రేపింది. శుక్రవారం అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలోని పోడు భూముల్లో వ్యవసాయం చేస్తుంటే అడ్డొస్తున్నారని ఓ మహిళా రైతు అధికారులపై పెట్రోల్ పోసి, నిప్పు పెట్టేందుకు యత్నించింది. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వెంటనే అక్కడికి చేరుకొని గొడవను సద్దుమణిగేలా చేశాడు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. ఆదివాసీలకు నచ్చజెప్పారు. ఈ వ్యవహారంపై అటవీ అధికారులు సైతం సీరియస్‌గా తీసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే..
అమ్రాబాద్ మండల పరిధి మాచారంలో 20 ఆదివాసి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇదే గ్రామంలో ఉన్న సుమారు 60 ఎకరాల పోడు భూముల్లో సాగు చేసుకుంటూ ఈ కుటుంబాలు ఏండ్లుగా జీవనం సాగిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయం చేయకూడదని గత నెల రోజులుగా అటవీశాఖ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆదివాసి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పోడు భూముల్లో బేస్‌లైన్ వేసేందుకు అధికారులు రావడంతో.. సున్నం బస్తాలు పగులగొట్టారు. తాడులను కూడా తెంచేశారు. ఎన్నో ఏండ్లుగా సాగు చేస్తున్న భూముల్లో ఇప్పుడు వ్యవసాయం వద్దనడం ఏంటని అధికారులను ప్రశ్నించారు.
దాదాపు గంటన్నర పాటు ఆదివాసీలు-ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య వాగ్వివాదం కొనసాగింది. అధికారులు ఎంతకీ వెనక్కి వెళ్లకపోవడంతో.. తీవ్ర ఆవేదనకు గురైన ఓ ఆదివాసి మహిళా రైతు తన వెంట తెచ్చిన పెట్రోల్‌ను అధికారులపై చల్లింది. అనంతరం నిప్పు పెట్టేందుకు ప్రయత్నించగా.. సదరు అధికారులు అడ్డుకున్నారు. భూముల కోసం చావడానికైనా.. చంపడానికైనా సిద్ధం అంటూ పలువురు రైతులు బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో.. అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
బైక్‌పై వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. అధికారులపై ఫైర్
మాచారం పోడు భూముల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వెంటనే(టూ వీలర్‌పై) అక్కడికి చేరుకున్నారు. తొలుత అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆదివాసి రైతులకు మద్దతునిచ్చారు. అమ్రాబాద్ మండలంలో పలువురు రైతులు పోడు భూముల విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. త్వరలోనే దీనిపై సీఎం కేసీఆర్ కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటారని రైతులకు భరోసానిచ్చారు.
ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు సంయమనం పాటించాలని సూచించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు అవకాశం కల్పించాలని ఘాటుగానే అధికారులను హెచ్చరించారు. సంఘటన స్థలం నుంచే అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన గువ్వల బాలరాజు వివాదం సద్దుమణిగేలా చేశారు. అనంతరం అటవీశాఖ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. అధికారులు తాత్కాలికంగా వెనుదిరిగినా మళ్లీ ఇబ్బంది పెడుతారని పలువురు రైతులు ఎమ్మెల్యే గోడు వెళ్లబోసుకున్నారు.
ఆటంకం కలిగించినవారిని వదిలిపెట్టం..
ఇదిలా ఉంటే.. మాచారం పోడు భూముల్లో బేస్ లైన్ వేసేందుకు వెళ్లిన అధికారులకు అడ్డు చెప్పిన వారిని వదిలిపెట్టేది లేదంటూ అమ్రాబాద్ రేంజర్ అర్చన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విధులకు ఆటంకం సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, పెట్రోల్ పోయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గ్రామ ప్రజల వద్ద ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు లేవని ఆరోపించారు. ఇదే విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అధికారుల ప్రకటనతో మాచారం గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ ఆదివాసి రైతులు భయాందోళనలో పడ్డారు.