స్కూళ్లకు సెలవులే.. పరీక్షల్లో మార్పులు లేవు: ఆదిమూలపు

by srinivas |
స్కూళ్లకు సెలవులే.. పరీక్షల్లో మార్పులు లేవు: ఆదిమూలపు
X

కరోనా వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు మూసివేత నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, స్కూళ్లకు సెలవులిచ్చినప్పటికీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ఈనెల 31 నుంచి నిర్వహించేందుకు ఒకసారి వాయిదా వేశామని ప్రకటించిన ఆయన, ఈ పరీక్షలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలు కూడా ఈనెల 23వ తేదీ నాటికి పూర్తవుతాయని చెప్పారు. సెలవుల నేపథ్యంలో విద్యార్థులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ నెలాఖరున మొదలయ్యే పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య సౌకర్యం కూడా అందజేస్తున్నామని ఆయన వెల్లడించారు. పరీక్షల నిర్వహణతో పాటు, పాఠశాలల సెలవుల విషయంలో ఈనెల 31వ తేదీ తరువాత మరోసారి సమీక్షించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

Tags : education, school, holidays, coronavirus holiday, 10th exams, adimulapu suresh

Advertisement

Next Story