డిమాండ్ తగ్గితే ఉద్యోగుల తొలగింపు

by Harish |
డిమాండ్ తగ్గితే ఉద్యోగుల తొలగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయి కంపెనీలు, ఉద్యోగులు భారీ నష్టాన్ని చూశారు. ఆదాయం కోల్పోయిన కంపెనీలు క్లిష్ట పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం, క్రమంగా సాధారణస్థితికి రావడం కంపెనీలకు, ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చే విషయం. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఆటోరంగానికి మాత్రం ఒడిదుడుకులు తప్పవని తెలుస్తోంది. రానున్న మరికొద్ది రోజుల్లో వాహన విక్రయాలు పుంజుకోకపోతే భారీగా ఉద్యోగాల కోత తప్పదని ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే తయారీ యూనిట్లలో అవసరానికి మించి సామర్థ్యం ఉందని, మున్ముందు డిమాండ్ లేకపోతే కార్మికులను, సిబ్బందిని తొలగించక తప్పదని వెల్లడించింది. ఆటో అమ్మకాలు లేక ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయంలో వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాల్సిన తప్పని పరిస్థితులు ఎదురవుతాయని ఏసీఎంఏ వివరించింది. వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల తొలగింపు కూడా ఓ మార్గంగా మారుతుందని ఏసీఎంఏ అధ్యక్షుడు దీపక్ జైన్ చెప్పారు. అయితే, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులు కూడా పనిలో ఉన్నారని, విక్రయాలు లేకపోవడం లేదా డిమాండ్ తగ్గడం జరిగితే వీరి అవసరం ఉండకపోవచ్చని చెప్పారు.

కరోనా నేపథ్యంలో పర్మినెంట్ ఉద్యోగుల కంటే కాంట్రాక్టు ఉద్యోగుల పైనే అధిక ప్రభావం ఉంటుందని గతంలోనే ఓ సర్వే వెల్లడించింది. ఆటో విడిభాగాల కంపెనీల్లో సుమారు 50 లక్షల మంది ఉద్యోగులున్నారు. గతేడాది మందగమనం కారణంగా ఈ పరిశ్రమలో 18 శాతం కుంచించుకుపోగా, ఈ ఏడాది 20 శాతం నుంచి 40 శాతం క్షీణించవచ్చునని అంచనాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఆటో విక్రయాలు లేవు. ఇప్పుడిప్పుడే వ్యవస్థలు తెరుచుకుంటున్న వేళ కార్మికులు అదనంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రంగంలో కొత్త ఉద్యోగాలు లేకపోగా.. డిమాండ్ క్షీణిస్తే ఉన్నవారిలోంచి కొంతమందిని తొలగించే ప్రమాదముంది. కరోనా కారణంగా 35 శాతం నుంచి 40 శాతం వరకు విక్రయాలు తగ్గిపోవచ్చని ఆటో ఇండస్ట్రీ బాడీ సియామ్ అంచనా వేసింది. రెండేళ్ల పాటు ఈ పరిస్థితి కొనసాగితే దాదాపు 50 శాతం తగ్గినా.. ఉత్పత్తి, డిమాండ్ లేక ఉద్యోగాలలో కోత తప్పదని దీపక్ జైన్ వివరించారు.

Advertisement

Next Story