మైనర్ అత్యాచార కేసులో నిందితుడి అరెస్టు..

by Anukaran |
మైనర్ అత్యాచార కేసులో నిందితుడి అరెస్టు..
X

దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లోని మారుతి అనాథాశ్రమంలో అత్యాచారానికి గురైన మైనర్ నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అయితే, ఆ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు వేణుగోపాల్ రెడ్డిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతనికి సహకరించిన హాస్టల్ వార్డెన్‌తో పాటు ఆశ్రమ యజమానులపై కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

వివరాల్లోకివెళితే… అనాథాశ్రమంలో ఉంటున్న 14ఏళ్ల బాలికపై వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి గత కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. బాధితురాలు అనారోగ్యానికి గురికావడంతో నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె అత్యాచారానికి గురవడమే కాకుండా, గర్భం దాల్చిందని నిర్దారించారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే పరిస్థితి విషమించి నిన్న బాధితురాలు మరణించింది.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అసలు విషయం ఆరా తీయగా.. ఆశ్రమంలోని వ్యక్తుల సాయంతో వేణుగోపాల్ రెడ్డి అత్యాచారం చేసినట్లు తేలింది. ఈ విషయంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీరియస్ అవ్వడమే కాకుండా.. విచారణకు నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటుచేసి.. ఈనెల 20లోపు నివేదిక అందజేయాలని ఆదేశించింది. అయితే.. బాలికకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసినట్లు బాధితురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, పరారీలో ఉన్న నిందితుడిని ఈరోజు పోలీసులు అరెస్టు చేసి, అతనికి సహకరించిన వారిపై కూడా పోక్సో చట్టం కింద కేసు పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed