గుండాల ఎస్ఐపై ఏసీబీ దాడి

by Shyam |
గుండాల ఎస్ఐపై ఏసీబీ దాడి
X

దిశ, భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లా గుండాల ఎస్ఐ చందర్ పై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహిం చారు. గుండాల మండలం మాసాని పల్లికి చెందిన ఖాసీం అనే బియ్యం వ్యాపారి హైదరాబాద్‌లోని బేగంపేటలో నివసిస్తున్నారు. అక్టోబర్ 29న ఖాసీంకు చెందిన బియ్యంతో వెళుతున్న డీసీఎంను గుండాల మండలం బ్రాహ్మణపల్లిలో స్థానిక పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. నవంబర్ 2న ఖాసీంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై వచ్చిన ఖాసీం హైకోర్టు ఉత్తర్వుల ద్వారా నవంబర్ 7న వెహికిల్ రిలీజ్ చేసుకున్నారు. కాగా రూ. 50వేలు ఇవ్వాలని, అంతే కాకుండా తిరిగి బియ్యం దందా కొనసాగాలంటే ప్రతి నెలా రూ. 30వేలు మామూలు ఇవ్వాలని వ్యాపారిని ఎస్ఐ డిమాండ్ చేశాడు.

దీంతో ఎస్ఐతో వ్యాపారి ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారం మొదట ఇవ్వా ల్సిన రూ. 50వేల కోసం రోజు ఫోన్ చేసి వ్యాపారిని ఎస్ఐ వేధించాడు. దీంతో బాధితుడు ఖాసీం ఏసీబీని ఆశ్రయించారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ రంగంలోకి దిగింది. రూ. 50 వేలు ఇవ్వడానికి స్టేషన్‌కు వస్తున్నానని ఎస్ఐకి బాధితుడు శుక్రవారం సమాచారం అందించాడు. కాగా స్టేషన్‌కు వద్దని పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి అందులో పని చేసే గణేశ్ అనే వ్యక్తికి ఇవ్వాలని ఎస్ఐ తెలిపాడు. అదే మాట ప్రకారం బాధితుడు డబ్బులు అందజేశాడు. అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు డబ్బులు తీసుకున్న వ్యక్తిని అనుసరించారు. ఆ వ్యక్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లిన కొద్ది సేపటికి లోపలికి వెళ్లి ఎస్ఐని తనిఖీ చేశారు. బాధితుని వద్ద తీసుకున్న రూ.50 వేలకు వేలి ముద్రలు సరిపోవడంతో ఎస్ఐని కస్టడీలోకి తీసుకున్నారు.

Advertisement

Next Story