కొడుకు పెళ్లి చూపులే.. తల్లికి ఆఖరి ఘడియలు !

by srinivas |
కొడుకు పెళ్లి చూపులే.. తల్లికి ఆఖరి ఘడియలు !
X

దిశ, వెబ్‌డెస్క్: కొడుక్కు పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేయాలన్న తల్లి కోరిక ‘కల’గానే మిగిలిపోయింది. ఇంటికి కోడలును తెచ్చుకొని సంసార బాధ్యతలను అప్పగించాలనుకున్న ఆ మహిళ అర్ధాంతరంగానే లోకాన్ని విడిచింది. కన్నపేగుకు సంబంధం చూసిన సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్తున్న ఆమె.. రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచింది. ప్రకాశం జిల్లాలో జరిగిన హృదయ విధారక సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఒందుట్ల గ్రామానికి చెందిన ఖాదర్‌ బి అనే మహిళ.. తన కొడుక్కు పెళ్లి చూపుల కోసం మార్కాపురానికి వెళ్లింది. పెళ్లిచూపులు అనంతరం మళ్లీ కొడుకుతో కలిసి ఒందుట్ల గ్రామానికి వెళ్తుండగా బైక్ వెనకాలో ఖాదర్‌బి కూర్చుంది. అయితే బేస్తవారిపేటకు చేరుకోగానే లారీని ఓవర్‌ టెక్ చేస్తున్న క్రమంలో బైక్ అదుపు తప్పడంతో ఖాదర్‌బి లారీ టైరు కింద పడగా కొడుకు దూరంగా ఎగిరిపడ్డాడు. అదేస్పీడులో మహిళపై లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. కొడుక్కు తీవ్రగాయాలయ్యాయి. పెళ్లి చూపుల కోసం వెళ్లి వస్తుండగా తన కళ్లముందే కన్నతల్లి దుర్మరణం చెందడంతో యువకుడు ఒక్కసారిగా హతాశుడయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story