ఎమ్మెల్యే అసంతృప్తి.. ‘ఎర్రబెల్లి ఉండగా మంత్రి పదవి నాకెలా వస్తుంది’

by Anukaran |
ఎమ్మెల్యే అసంతృప్తి.. ‘ఎర్రబెల్లి ఉండగా మంత్రి పదవి నాకెలా వస్తుంది’
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ డీసీసీబీ స‌మావేశంలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌, మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు మ‌ధ్య మాట‌ల పోరు సాగింది. ‌త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై వివ‌క్ష కొన‌సాగుతోంద‌ని ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి బదులుగా ‘మీరు మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఏం చేశారంటూ’ ఎర్రబెల్లి ప్రశ్నించారు. ‘ఎవ‌రి వ‌ద్ద నుంచి మంత్రి ప‌ద‌వి గుంజుకోలేద‌ని… చ‌నిపోయిన‌ ఆయ‌న పిలిచి మ‌రీ త‌న‌కు ఆ ప‌ద‌వి అప్పగించారన్నారు. ఇప్పుడు ఆయ‌న విష‌యం ఎందుకుగాని అంటూనే.. త్వరలో మీరు మంత్రి అవుతారంటూ రెడ్యా నాయక్‌ను ఉద్దేశిస్తూ ఎర్రబెల్లి వ్యాఖ్యానించాడు. దీనికి బదులుగా రెడ్యానాయక్‌ మీరుండగా మంత్రి పదవి తనకెలా వస్తోందని కుండ బద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలు ఓరుగల్లు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

తీవ్ర అసంతృప్తిలో రెడ్యా నాయక్‌

డోర్నకల్ రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మ‌య్యే రెడ్యానాయ‌క్ ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా రాజకీయాల‌కు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌లో ఎదిగిన ఆయ‌న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కూతురు మాలోతు కవితతో కలిసి టీఆర్ఎస్‌లో చేరారు. గతంలో మంత్రి పదవి కోసమే పార్టీలో చేరుతున్నట్టు అనుచరులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ,రెడ్యానాయ‌క్‌కు మంత్రి పదవి తొలి, మలి దశలోనూ ఇవ్వలేదు. దీనికి తోడు తన నియోజకవర్గంలోనే ఆయన కంటే జూనియర్ సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్సీ, మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆయనలో అసంతృప్తి పెరిగిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే కూతురుకు ఎంపీ పదవి ఇచ్చిన కేసీఆర్ తగు న్యాయం చేశారని పార్టీ వర్గాల్లో బలమైన అభిప్రాయం. అయినప్పటికీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాల్లోనే సీనియర్‌గా ఉన్న రెడ్యానాయక్‌ను పార్టీ అధినేత పట్టించుకోవట్లేదని భావన ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed