అరగంటలో పెళ్లి.. ఇంతలో ఘోర ప్రమాదం

by Sumithra |
అరగంటలో పెళ్లి.. ఇంతలో ఘోర ప్రమాదం
X

దిశ, కామారెడ్డి : అరగంటలో పెళ్లి.. ఇంతలో ట్రక్కు రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. వెనక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు పెళ్లి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పెళ్లి ట్రాక్టర్ బోల్తాపడి 15 మందికి గాయాలు కాగా.. ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామం వద్ద చోటుచేసుకుంది.

బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలం జువ్వాడి గ్రామానికి చెందిన మల్లమారి పెద్ద సాయిలు కూతురు మల్లికకు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. నేడు వివాహం జరుగుతుండగా.. అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు 20 మంది.. ట్రాక్టర్‌లో పెళ్లి సామానుతో తాడ్వాయి మీదుగా బయలుదేరారు. పెళ్లికి మరొక అరగంట సమయం ఉందనగా.. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో పెద్దమ్మ ఆలయం మూల మలుపు వద్ద గ్రామానికి చెందిన మరొక పెళ్లి బృందం రోడ్డుపై నుంచి వెళ్తుండటంతో ట్రాక్టర్ డ్రైవర్ బ్రేక్ వేసాడు.

ట్రాక్టర్ వెనకాలే సుమారు నాలుగు ట్రక్కులు వస్తున్నాయి. అతివేగంగా వస్తున్న ట్రక్కు.. ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ క్రమంలో ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడింది. ట్రాక్టర్‌లో ఉన్న పెళ్లి సామగ్రి.. మంచం, బీరువా ఇతర సామాను పెళ్ళికి వెళ్తున్న వారిపై పడటంతో సుమారు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆటోలు, 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాడ్వాయి పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. జిల్లా ఆస్పత్రికి తరలించిన వారిలో జువ్వాడి గ్రామానికి చెందిన కాశవ్వ అనే మహిళ మృతి చెందినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తాడ్వాయి ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు.

Advertisement

Next Story