కరోనాను జయించిన నర్సు దీనగాథ

by Shyam |   ( Updated:2020-05-15 10:48:38.0  )
కరోనాను జయించిన నర్సు దీనగాథ
X

‘నిలోఫర్​ హాస్పిటల్​లో స్టాఫ్​ నర్సుగా పనిచేసే నాకు కరోనా సోకింది. ఆ విషయం నాకు తెలియదు. మామూలుగానే ఇంటికెళ్లాను. మళ్లీ డ్యూటీకి వచ్చాను. ఓ రోజు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో మా ఆయనతోపాటు ఇద్దరు పిల్లలు, అత్తామామలు, ఆస్పత్రి నుంచి నన్ను బైక్​పై ఇంటికి తీసుకెళ్లిన మా తమ్ముడికి మెడికల్​ టెస్ట్​లు చేశారు. నా చేత్తో అన్నం తిన్న నా కుమార్తెకు పాజిటివ్‌ వచ్చింది. ఆ రోజు ఎందుకో కానీ నేను బాబుకు పాలు ఇవ్వలేదు. నెగెటివ్‌ వచ్చిన నా భర్త సహా అత్తామామలను హోం క్వారంటైన్​లో ఉంచారు. పాజిటివ్‌ వచ్చిన నా బిడ్డను కింగ్‌కోఠి ఆస్పత్రిలో, నన్నేమో గాంధీలో ఉంచారు. ఇలా ఒక్కొక్కరం ఒక్కోచోట ఉండిపోవాల్సి వచ్చింది. నావల్ల మా కుటుంబం మొత్తం చెల్లాచెదురై పోయింది. మా బాబు పాలకోసం ఏడవడం.. నా కోసం నా బిడ్డ ఏడవడం చూసి తట్టుకోలేక పోయాను. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే కింగ్‌కోఠిలో ఉన్న మా పాపను నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇద్దరం ఒకే దగ్గర ట్రీట్​మెంట్​ తీసుకున్నాం’

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని ఓ విలేజ్​కి చెందిన మహిళ నిలోఫర్ హాస్పిటల్​లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోన్నది. విధి నిర్వహణలో తనకు, కరోనా సోకింది. తరువాత కూతురికీ అంటుకుంది. చివరకు వ్యాధిని జయించి శుక్రవారం సొంతూరుకు వచ్చారు. వారిద్దరికీ గ్రామస్తులు, సర్పంచ్ పూలతో ఘన స్వాగతం పలికారు. మహమ్మారితో ఎలా పోరాటం చేశారో ఆమె మాటల్లోనే..

మదర్‌థెరిస్సా స్ఫూర్తితో 14 ఏళ్ల క్రితం ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నిలోఫర్‌ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌ నర్సుగా చేరాను. పెళ్లైన తర్వాత ఉద్యోగం మానేయమన్నారు. పేదలకు సేవ చేయాలనే ఆలోచనతో ఇంట్లో వాళ్లను ఒప్పించి డ్యూటీ చేస్తున్నా. ఆస్పత్రికి వచ్చే ప్రతి బిడ్డను నా సొంత బిడ్డలా చూసుకుంటా. ‍కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వం జనతా కర్ఫ్యూ తర్వాత మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ అమలు చేసింది. వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది సెలవులు కూడా రద్దయ్యాయి. లాక్‌డౌన్‌ వల్ల రవాణా సదుపాయాలు నిలిపివేయడంతో రాకపోకలకు ఇబ్బంది అయ్యేది. ప్రస్తుతం నాకు ఇద్దరు చిన్నపిల్లలు. వారిలో ఒకరు(బాబు) ఇంకా పాలు మరవలేదు. క్వారంటైన్‌ లీవ్స్​ కోసం అధికారులను రిక్వెస్ట్​ చేసినా. డ్యూటీకి రావాలని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో పాలు తాగే కొడుకుని వదిలేసి.. ఆస్పత్రిలోనే ఒక గదిలో ఉంటూ డ్యూటీ చేశాను.

ఓ శిశువు నుంచి వైరస్‌ సోకింది

ఏప్రిల్‌ 15న ఓ చిన్నారి నిలోఫర్‌ ఎమర్జెన్సీ విభాగంలో అడ్మిట్​ అయ్యింది. ఆ శిశువుకు ఇంజక్షన్లు నేనే ఇచ్చాను. ఆ సమయంలో మాకు ఎన్‌-95 మాస్క్‌ కానీ, పీపీఈ కిట్లు కానీ లేవు. గుక్కపట్టి ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఎత్తుకుని ఓదార్చాను. ఆ పాపకు 17న కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అప్పటికే నేను శిశువుకు చాలా సన్నిహితంగా మెలిగాను. నాతో సహా ఆ రోజు డ్యూటీలో ఉన్న వారందరినీ క్వారంటైన్‌ చేశారు. 25వ తేదీన నా నుంచి శాంపిల్‌ కలెక్ట్‌ చేసి టెస్టులకు పంపారు. రెండు రోజుల పాటు రిపోర్ట్‌ కోసం ఎదురు చూశాను. ఇంటి వద్ద కొడుకు పాల కోసం ఏడుస్తుండటంతో ఉండలేక 27న మధ్యాహ్నం మా తమ్ముడితో బైక్‌పై ఇంటికి వెళ్లాను. అప్పటికే పాప ఆకలేస్తుందని ఏడవడం? తినిపించాలని ఒత్తిడి చేయడంతో అన్నం తినిపించాను. ఆ తర్వాత హాస్పిటల్​ నుంచి ఫోన్‌ వచ్చింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నాకు పాజిటివ్​ వచ్చినట్టు చెప్పారు. గచ్చిబౌలి నుంచి 108 అంబులెన్స్‌ పంపించారు. అదే రోజు రాత్రి నన్ను గాంధీ హాస్పిటల్​కి తీసుకెళ్లారు. ఆ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్​ అందరనీ హోం క్వారంటైన్​ చేశారు. నాతో పాటు మా పాపకు కూడా పాజిటివ్​ రిపోర్ట్​ రావడంతో కింగ్​కోఠికి తరలించారు. ఇట్లా అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్న మా ఫ్యామిలీ మొత్తం కరోనా మహమ్మారితో చెల్లాచెదురైంది. ట్రీట్​మెంట్​ తర్వాత మేము కోలుకోవడం, రిపోర్టులు నెగెటివ్​ రావడంతో ఇంటికి పంపించారు. ఇప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాం.

Advertisement

Next Story