- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పడి లేచిన కెరటం.. ఎలెన్ మస్క్
దిశ, వెబ్ డెస్క్: కెరటం నాకు ఆదర్శం.. ఎందుకంటే ఎగసి పడినందుకు కాదు.. కింద పడినా లేచినందుకు అని అన్నాడో కవి. నిజమే పడి లేవడం గొప్పే. మరి పడిన ప్రతీసారి లేస్తే దాన్ని ఏమంటారు? దానికి ఏదైనా పేరు పెట్టాల్సి వస్తే.. ఎలెన్ మస్క్ పేరే దానికి సూటవుతుంది. ఆయన జీవితం ఒక్కోసారి అద్దాల మేడల అందంగా కనిపిస్తుంది. మరో సారి పేక మేడలా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన ఆస్తులు నిమిషాల్లో కరిగిపోతుంటాయి… రోజుల్లో పెరిగి పోతుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన జీవితం ఓ పరమ పద సోపాన ఫటం అని చెప్పాలి. తాజాగా బ్లూమ్ బర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానం దక్కించుకుని ఎలెన్ మస్క్ మరో సారి వార్తల్లో నిలిచారు. ఆయన జీవితం గురించి వివరాలను తెలుసుకుందాం రండి….
ఎలెన్ మస్క్..ఈ పేరు చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ ఆయన కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్స్ పేరు చెబితే ఇట్టే గుర్తొస్తుంది. పేపాల్ కే పేమెంట్ గేట్ వే అమ్మిన వ్యక్తి అతను..భూమిపై టెస్లా కారు నుంచి అంగారక గ్రహంపై షికారు వరకు ఆయన ఆలోచనలే అంతటి గుర్తింపు తెచ్చాయి. ఇవన్నీ ఒక్క రోజులో వచ్చినవి కావు. దీని వెనుక ఎన్నో ఏండ్ల శ్రమ..ఎంతో పట్టుదల దాగి ఉంది. ఎలెన్ మస్క్ పుట్టింది దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో.. అతని తండ్రి ఓ ఇంజినీర్, తల్లి ఓ మోడల్. చిన్న తనంలోనే తల్లి దండ్రులు విడిపోవడం అతనిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పెద్దయ్యాక తండ్రి నుంచి తెగ తెంపులు చేసుకుని ఒంటరి జీవితం గడిపాడు.
చిన్నతనం నుంచే ఆవిష్కరణలన్నా..వ్యాపారం అన్న అతనికి చాలా ఇష్టం. అందుకే 12 ఏండ్ల వయస్సులోనే బ్లాస్టర్ అనే వీడియో గేమ్‌ను కనిపెట్టి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఆ తర్వాత దాన్ని పీసీ అండ్ టెక్నాలజీ అనే పత్రికకు అమ్మి తొలి సంపాదనతో అందరిని అబ్బుర పరిచాడు. వ్యాపారం పై ఉన్న ఆసక్తి వల్ల పీహెచ్‌డీని పక్కన పెట్టి ముందు అడుగు వేశాడు. అనుకున్నదే తడవుగా ఇన్వెస్టర్ల సాయంతో సోదరుడు కింబల్‌తో కలిసి ఓ వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం అనుకున్న దాని కన్నా అద్భుతంగా సక్సెస్ అయింది. కానీ దానికి సీఈవో అవ్వాలనుకున్నా…ఇన్వెస్టర్లు ఒప్పుకోక పోవడంతో ఆ ఆశ నెరవేరలేదు. ఆ తర్వాత ఆ సంస్థను అత్యధిక ధరకు వేరే కంపెనీకి విక్రయించి అందరి దృష్టిని ఆకర్షించాడు. వచ్చిన డబ్బుతో ఎక్స్ కామ్ అనే ఆన్‌లైన్ బ్యాంకింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు. అనంతరం దాన్ని పేపాల్ సంస్థకు విక్రయించి మరోసారి వ్యాపారంలో తనకు ఉన్న పట్టు ఎలాంటిదో నిరూపించుకున్నాడు.
ఆ తర్వాత ఆయన గురి అంగారకుడిపై పడింది. అక్కడికి మానవ జీవనానికి దారులు వేయాలనుకున్నాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనుకున్నాడు. కానీ తొలి ప్రయత్నంలో వైఫల్యం వెక్కిరించింది. అతని సంస్థ ప్రయోగించిన స్పేస్ ఎక్స్ రాకెట్ కూలిపోయింది. ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఆయన్ను వైఫల్యాలు వెంటాడాయి. మొత్తం దీవాళ తీసే పరిస్థితికి చేరుకున్నాడు. కానీ ఆయన పట్టు వదల లేదు. తన దగ్గర ఉన్న దాంట్లో ఆఖరి రూపాయి వరకు ఆ ప్రయోగానికి ఖర్చు పెట్టాడు. ఓ సమయంలో అతని దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. కానీ ఎక్కడా అతని ఆత్మస్థైర్యం చెక్కు చెదరలేదు. ఆ ధైర్యాన్ని చూసి అపజయాలు తోక ముడిచాయి. కొద్ది కాలంలోనే ప్రైవేట్ రంగంలో అతి పెద్ద రాకెట్ తయారీ ఇంజిన్ల సంస్థగా స్పేస్ ఎక్స్ అవతరించింది.
ఆ తర్వాత రోడ్ స్టర్ పేరిట అత్యంత వేగంగా ప్రయాణించే కార్లను తయారు చేయాలనుకున్నాడు. కానీ ఉత్పత్తి ఆలస్యమైంది. అనుకున్నవి తల కిందులయ్యాయి. చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. అయినా ఎక్కడా అధైర్య పడకుండా తన దగ్గర మిగిలిన కొద్ది పాటి డబ్బుతో టెస్లా కార్ల కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. అతి తక్కువ కాలంలోనే మళ్లీ అందనంత స్థాయికి ఎదిగాడు. గతేడాది రెండు నిమిషాల్లో ఏకంగా రూ. 7,572 కోట్లు నష్ట పోయాడు..అయినా బెదర కుండా ధైర్యంగా ముందడుగు వేశాడు. ఇప్పుడు ఏకంగా ప్రపంచ ధనవంతుల జాబితాలో నిలిచి మళ్లీ అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు… ఇలా ఆయన పడి లేచిన సందర్భాలెన్నో ..అందుకే ఆయన ఓ పడి లేచిన కెరటం….