మానేరు వాగులో చిక్కుకున్న గొర్ల కాపరి.. రంగంలోకి దిగిన పోలీసులు(వీడియో)

by Sridhar Babu |   ( Updated:2023-03-28 18:03:09.0  )
మానేరు వాగులో చిక్కుకున్న గొర్ల కాపరి.. రంగంలోకి దిగిన పోలీసులు(వీడియో)
X

దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా మానేరు వాగులో ఓ గొర్రెల కాపరి చిక్కుకుపోయాడు. సిరిసిల్ల పట్టణం సుభాష్​నగర్‌కు చెందిన చంద్రమౌళి అనే కాపరి తన దగ్గరున్న గొర్రెలను మేపేందుకు సోమవారం మధ్యాహ్నం మానేరు వాగు ప్రాంతానికి వెళ్లాడు.

నెహ్రూనగర్ చెక్‌డ్యాం వద్ద వాగు మధ్యలో ఉన్న గట్టు ప్రాంతంలో పచ్చిక బయళ్లను గమనించిన చంద్రమౌళి గొర్రెలను అక్కడికి తోలుకొని వెళ్లాడు. ఈ క్రమంలో సాయంత్రం ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో గట్టు చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. దాదాపు 40 నుంచి 50 గొర్రెలతో సహా చంద్రమౌళి అక్కడే చిక్కుకుపోయాడు.

వరద తక్కువగా ఉన్న సమయంలో తాను బయటకు వద్దామనుంకుంటే ప్రాణంగా చూసుకుంటున్న మూగజీవాలను వదిలివచ్చేందుకు మనసొప్పక అక్కడే ఉండిపోయాడు. చూస్తుండగానే వరద ప్రవాహం మరింత పెరిగిపోయింది. అయితే బయటకు వచ్చేందుకు ఎలాంటి సహకారం లేకపోవటం వల్ల మూగజీవాలతో కలిసి బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయాడు. ఫోన్ సహాయంతో కుటుంబ సభ్యులు, స్థానికులకు సమాచారం అందజేశాడు.

దీంతో స్థానికులు అక్కడకి చేరుకుని చంద్రమౌళిని రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల వాగులో దిగేందుకు కూడా వారు భయంతో జంకుతున్నారు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకుని కాపాడే ప్రయత్నాలు ప్రారంభించారు. కాపరిని, మూగజీవాలను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా వరద ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల ఆటంకం ఏర్పడుతోంది.

నిన్నటి నుంచి ఏమీ తినకుండా ఎలా ఉన్నాడోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా చంద్రమౌళిని రక్షించాలని వేడుకుంటున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల కాపాడేందుకు సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed