హుజురాబాద్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స

by sudharani |

కరీంనగర్: హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు ఓ నిండు గర్భిణీకి అరుదైన శస్త్ర చికిత్స చేసి తల్లీబిడ్డలను కాపాడారు. వివరాల్లోకెళ్తే.. ప్రకాశం జిల్లా కొండేపి మండలానికి చెందిన ఏడుకొండలు, జయమ్మ దంపతులు బతుకుదెరువు నిమిత్తం రాష్ట్రానికి వచ్చి జమ్మికుంటలో నివసిస్తున్నారు. వారి కూతురు అనూష దంపతులూ ఇక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో అనూష గర్భవతి అయినప్పట్నుంచీ నెలనెలా హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంటున్నది. ప్రసవ తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ఆమె పరిస్థితి విషమించడంతో, వెంటనే అత్యవసర శస్త్ర చికిత్స చేయాలనీ, ఇందుకు సుమారు రూ.2లక్షల పైచిలుకు ఖర్చవుతుందని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు సూచించారు. దీంతో స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవ్వగా, లాక్ డౌన్ వల్ల వెళ్లలేకపోయారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. స్వగ్రామానికి వెళ్లలేరు. విషమిస్తున్న కూతురి ఆరోగ్య పరిస్థితి. ఏం చేయాలో తెలియక విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన రాజేందర్.. హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డా.వాడె రవి ప్రవీణ్ రెడ్డి, ఆర్ఎంవో డా.శ్రీకాంత్ రెడ్డిలతో మాట్లాడి, బాధితురాలిని ఎలాగైనా ఆదుకోవాలని ఆదేశించారు. దీంతో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి సర్జన్ ఆధ్వర్యంలోని వైద్య బృందం రెండు గంటలపాటు శ్రమించి ఆపరేషన్‌ (సిజేరియన్ హిస్టెక్టమి ఆఫ్ రైట్ సైడ్ హార్న్)ను విజయవంతంగా పూర్తిచేసి, తల్లీబిడ్డలను రక్షించారు. బతుకుదెరువు కోసం వచ్చిన తమ పరిస్థితిని అర్థం చేసుకుని వారి కూతురి ప్రాణాలు కాపాడిన వైద్యులు, కారకులైన ఈటలకు రుణపడి ఉంటామని కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులను మంత్రి అభినందించారు.

tags: rare sagerian, huzurabad, doctors, etela rajender, health minister, prakasham, medical superintendent vade ravi praveen reddy,

Advertisement

Next Story

Most Viewed