ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక మలుపు

by srinivas |
high court
X

దిశ, ఏపీ బ్యూరో : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో నిందితుడిగా ఉన్న గంటా సుబ్బారావుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విషయంలో గంటా సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గంటా సుబ్బారావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ పోలీసులకు అందుబాటులో ఉండాలని.. ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సీఐడీకి అందుబాటులో ఉండాలని సుబ్బారావును ఆదేశించింది. అయితే సుబ్బారావును విచారించాలంటే ఒకరోజు ముందుగా నోటీసులివ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి కమిటీలో ఉన్న వారందరినీ ఎందుకు చేర్చలేదని ధర్మాసనం ప్రశ్నించింది. సుబ్బారావు మాత్రమే నిధులు దుర్వినియోగం చేశారని ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఈ కేసులో కొంతమందిని మాత్రమే నిందితులుగా పేర్కొనడం పట్ల సుబ్బారావు తరపు లాయర్ ఆదినారాయణ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే కొందరిని ఈ కేసులో ఇరికించారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇకపోతే టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టిన సీమెన్స్‌ ప్రాజెక్టు వ్యవహారంలో రూ. 241 కోట్లు మేర నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించిన ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు మాజీ సీఈవో, ఎండీ గంటా సుబ్బారావును, మరికొందరిని నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story