'ఇదొక మంచి అవకాశం.. సద్వినియోగం చేసుకోండి'

by Shyam |   ( Updated:2020-04-30 08:44:32.0  )
ఇదొక మంచి అవకాశం.. సద్వినియోగం చేసుకోండి
X

దిశ, రంగారెడ్డి: తీగ జాతి కూరగాయలతో పాటు, పండ్లు, సాధరణ కూరగాయలు సాగు చేసేందుకు ఆసక్తి గల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోన్నది. అందులో భాగంగానే పంటలను సాగు చేసేందుకు ప్రభుత్వం రాయితీలు కల్పించనుంది. 2020-21 ఆర్థిక ప్రణాళికల ఆధారంగా జిల్లాకు కొంత లక్ష్యాన్ని నిర్థేశించింది. అర్హులైన రైతులు వచ్చే ఏడాది మార్చి నెలలోపు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని, రైతు అభివృద్ధి చెందుటకు, పంట విస్తీర్ణము పెంచడంతోపాటు ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడం, మార్కెట్‌ ధరల గురించి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారమందిస్తామని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సునంద తెలిపారు. ఈ పంటలను సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు 50 శాతం రాయితీతో రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం, క్రిటికల్‌ ఇంటర్వెన్షస్‌ పథకాలను ప్రవేశపెడుతుంది. రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం ద్వారా శాశ్వత పందిర్లు, మల్చింగ్‌, వేసవిలో కూరగాయల ఉత్పత్తికి రాయితీలు ఇవ్వనున్నారు. అదేవిధంగా జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇనిస్టిట్యూట్‌ లో నారు పంటలకు నారు పంపిణీ చేయనున్నారు.

శాశ్వత పందిర్లు…

తీగ జాతి కూరగయాలు పండించేందుకు శాశ్వత పందిర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఉద్యానవన శాఖ 50 శాతం రాయితీ ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. అర ఎకరం నుంచి 2.5 ఎకరాల భూమి కలిగిన రైతుకు ఈ పథకం వర్తించనుంది. ఒక రైతుకు ఒక యూనిట్‌ మాత్రమే ఇవ్వనున్నారు. ఆ యూనిట్‌కు రూ.50వేలు మించకుండా ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో 161 యూనిట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్థేశించింది. ఇందులో 25 యూనిట్లు షెడ్యూల్‌ కులాలు (ఎస్సీ), 15 యూనిట్లు షెడ్యూల్‌ తెగలకు (ఎస్టీ), మిగిలిన 121 యూనిట్లు ఇతరులకు కేటాయించారు.

మల్చింగ్‌…

కూరగాయలు, పండ్ల తోటలలో నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు ప్రభుత్వం చేయూతనిస్తోన్నది. అందులో భాగంగానే హెక్టార్‌కు రూ.16వేల చొప్పున 2 హెక్టార్ల వరకు ఇస్తుంది. ఇందులో 50 శాతం ప్రభుత్వం భరించనుంది. జిల్లాలో 106 హెక్టార్ల లక్ష్యాన్ని కేటాయించగా, షెడ్యూల్‌ కులాలకు 16 హెక్టార్లు, షెడ్యూల్‌ తెగలకు 10 హెక్టార్లు, ఇతరులకు 80శాతం హెక్టార్లు కేటాయించారు.

వేసవిలో కూరగాయల ఉత్పత్తి…

వేసవిలో కూరగాయలు పండించుటకు రైతులు తమ పొలములో బిందు, తుంపర సేద్యంతో, షేడ్‌ నెట్‌, మల్చింగ్‌ను ఉపయోగిస్తూ పంటను పండించేందుకు 75 శాతం రాయితీని ప్రభుత్వ కల్పిస్తోన్నది. ఇందుకు 2 ఎకరాల వరకు ఉన్న రైతులే లబ్ధిదారులు. అయితే ఎకరాకు రూ.1,20,600 ఇవ్వనున్నారు. జిల్లాలో 3 ఎకరాలే లక్ష్యాంగా ప్రభుత్వం కేటాయిస్తే 1 ఎకరం షెడ్యూల్‌ కులాలకు, మిగిలిన 2 ఎకరాలు ఇతరులకు కేటాయించారు.

క్రిటికల్‌ ఇంటర్వెన్షస్‌ పథకం…

క్రిటికల్‌ ఇంటర్వెన్షన్‌(అరుదైన పంటలు) పథకంలో భాగంగా టమాట, వంగ, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, క్యాప్సికం, కూరగాయ నారులు ఇవ్వనున్నారు. ఈ నారుకు ఎకరాకు రూ.8 వేల వరకు ఖర్చవుతుంది. దీనికి ప్రభుత్వం 90 శాతం రాయితీపై ఒక్కో రైతుకు 2 ఎకరాల వరకు నారు ఇవ్వనున్నది. కానీ, రైతు భరించాల్సిన ఖర్చు రూ.800లతో టమాట, వంగ నారుకు ఎకరాకు 8000 మొక్కలు ఇవ్వనున్నారు. అదే పచ్చి మిర్చి, ఎండుమిర్చి, క్యాప్సికం అయితే ఎకరాకు 6400 మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఈ పథకంలో నారు కావాల్సిన రైతులు 45 రోజుల ముందుగానే స్థానిక ఉద్యానవన శాఖాధికారి ద్వారా జిల్లా అధికారికి నారు పేరు, మీ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు రైతులు నాన్‌ సబ్సిడీ రూ.800ల డీడీని అడిషనల్‌ డైరెక్టర్‌ హార్టికల్చర్‌ జీడిమెట్ల పేరుతో తీసి దరఖాస్తు చేసుకునే ఫారానికి జత చేయాలి. జిల్లాలో మొత్తం 107 ఎకరాలు లక్ష్యాన్ని నిర్థేశించింది. ఇందులో 18 ఎకరాలు షెడ్యూల్‌ కులాలు, 10 ఎకరాలు షెడ్యూల్‌ తెగలకు, మిగిలిన 79 ఎకరాలు ఇతరులకు కేటాయించింది.

రైతులు సంప్రదించాల్సిన అధికారులు వీరే…

బాలాపూర్‌, సరూర్‌నగర్‌, శంషాబాద్‌, మహేశ్వంర, కందుకూర్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, గండిపేట, అబ్దుల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌, మంచాల, కడ్తాల్‌, ఇబ్రహీంపట్నం, యాచారం, మాడ్గుల, అమన్‌గల్‌ మండలాల రైతులు ఉద్యానవన అధికారి బి. కనకలక్ష్మీ (7997725239)ని సంప్రదించాలి. అలాగే మొయినాబాద్‌, శంకర్‌పల్లి, చేవెళ్ల, షాబాద్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, గండిపేట మండలాల రైతులు.. స్వరూప్ కుమార్(7997725424)ని సంప్రదించాలి. షాద్‌నగర్‌, కేశంపేట, కొత్తూరు, నందిగామ, చౌదర్‌గూడెం, కొందుర్గు, తలకొండపల్లి మండలాలవారు టి. ఉషారాణి(7997725243)ని సంప్రదించాలని అధికారులు తెలిపారు.

ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సునంద రెడ్డి, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖాధికారి

ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తోన్నది. అందులో భాగంగానే 2020-21 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాలో ఇవ్వాల్సిన రాయితీలను సిద్దం చేశాము. అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకొని రాయితీని పొందాలి. అతి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చే పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోన్నది. రంగారెడ్డి జిల్లాలో అత్యధిక మంది కూరగాయలు, పండ్ల తోటలపై ఆధారపడి జీవిస్తుంటారు. వీరి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపోందించాము.

Tags: Ranga Reddy, Farmers, Parks, Subsidy, Crops, Vegetables

Advertisement

Next Story