పరిశ్రమలకు తప్పని ముప్పు : ఫిక్కీ సర్వే!

by Harish |
పరిశ్రమలకు తప్పని ముప్పు : ఫిక్కీ సర్వే!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థికవ్యవస్థను కొవిడ్-19 మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదముందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కి సర్వే వెల్లడించింది. మార్చి చివరి వారం నుంచి దేశంలోని ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆగిపోయాయని, రానున్న రోజుల్లో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై కరోనా వైరస్ అనిశ్చితి తప్పదని ఫిక్కీ-ధృవ సర్వే నివేదించింది. ఇప్పటివరకు ఉన్న ప్రభావాన్ని మించి తీవ్ర నష్టాన్ని పరిశ్రమలు ఎదుర్కోక తప్పదని సర్వే అభిప్రాయపడింది. సర్వేలో పాల్గొన్న పరిశ్రమలన్నీ ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం డిమాండ్‌కు ప్రతికూలత తప్పదని భావిస్తున్నట్టు స్పష్టం చేశాయి. ప్రస్తుతమున్న అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 శాతం అమ్మకాలు పడిపోతాయని స్పష్టం చేశాయి.

ఇప్పటికే అనేక కంపెనీలకు నగదు లభ్యత క్షీణించిపోయింది. దీనికి తోడు ఆర్డర్లు తగ్గిపోయాయని సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. ఇటీవల ఓ నివేదికలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లోని తొలి 500 సంస్థల్లో సగానికిపైగా సంస్థలకు నగదు లభ్యతకు సంబంధించి సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. సుమారు 55 శాతం కంపెనీలు రుణాలు, సర్వీసుల వ్యయాన్ని భరించే స్థితిలో లేవు. కేంద్రం నిర్దిష్ట ఆర్థిక ప్యాకేజీతో సత్వరమే ఆదుకోకపోతే పరిశ్రమలన్నీ తీవ్ర గడ్డు పరిస్థితి నుంచి తప్పించుకోలేవని సర్వే నివేదించింది. అంతేకాకుండా సంస్థలు భారాన్ని తగ్గించుకునేందుకు ఎక్కువ సంఖ్యలో సిబ్బందిని తొలగించే యోచనలో ఉన్నట్టు తెలిపాయి. రానున్న మరికొద్ది నెలల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని వెల్లడించింది. గతేడాది చివర్లో అనేక సంస్థలు కొత్త ఆర్థిక సంవత్సరానికి వ్యాపారాల విస్తరణ చర్యలకు ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ కొవిడ్-19 వల్ల ప్రణాళికలన్నీ వాయిదా వేసుకున్నాయి. దశాబ్దాలుగా పారిశ్రామిక రంగం సాధించిన ప్రయోజనాలు వృధా అయ్యిందని ఫిక్కీ పేర్కొంది. ప్రజలన్ను, సంస్థలను, అందులోని ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే ఆదుకునేలా తక్షణ సాయం ఇవ్వాలని ఫిక్కీ-ధృవ సర్వే అభిప్రాయపడింది.

ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడేందుకు సంస్థలు వీలైనంత వేగంగా ద్రవ్య సరఫరాను పెంచాల్సిన అవసరముందని, డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం తగిన చర్యలను చేపడుతుందని ఫిక్కీ ప్రెసిడెంట్ సంగీత అభిప్రాయపడ్డారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమలను ఆదుకునేలా ప్రభుత్వం ద్రవ్య ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వడంతో పాటు ద్రవ్య లభ్యతను పెంచడం, తక్కువ వడ్డీకే రుణాల మంజూరు, పన్ను రీఫండ్‌లు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టడం ముఖ్యమని సర్వేలో సూచిస్తోంది.

Tags: covid19, corona virus impact on factories, FICCI

Advertisement

Next Story

Most Viewed