- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలోనే ఝలకిచ్చిన సొంత నేతలు.. బిగ్ షాక్‌లో కేసీఆర్ అండ్ టీమ్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆఫీసును తెరవడాన్ని ఆ పార్టీ నేతలు గొప్పగానే చెప్పుకుంటున్నారు. కానీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటకు చెందిన ఆరుగురు అధికార పార్టీ సర్పంచ్‌లు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరి అధికారపార్టీకి షాకిచ్చారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే ఈ ఆరుగురు సర్పంచ్‌లు, మరో ఎంపీటీసీ ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ నేతలంతా ఢిల్లీలో ఉండగా, మరోవైపు అదే జిల్లాకు చెందిన మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆ పార్టీకి ఒకింత నిరుత్సాహం కలిగించింది. ఎన్నో ఆకాంక్షలతో ఉద్యమంలో పాల్గొన్న తమకు ఇప్పుడు స్వేచ్ఛ లేకుండా పోయిందని, నియంతృత్వాన్నే చూస్తున్నామని బీజేపీలో చేరిన ఈ ఏడుగురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చొరవతో ఈ ఏడుగురు బీజేపీలో చేరారు. దౌల్తాబాద్ మండలంలోని దీపాయంపల్లి గ్రామ సర్పంచ్ లావణ్య, కొనాయపల్లి సర్పంచ్ కొత్త సురేందర్ రెడ్డి, ముత్యంపేట సర్పంచ్ బానోయి రాజు, లింగాయపల్లి తాండా సర్పంచ్ దేవి యాదగిరి, లింగరాజుపల్లి సర్పంచ్ ఖేత కనకరాజు, దుబ్బాక మండలంలోని తాళ్ళపల్లి సర్పంచ్ గోపారి ప్రియాంకలతో పాటు మిర్‌దొడ్డి మండలం ధర్మారం, లక్ష్మీనగర్, ఆరేపల్లి గ్రామాలకు చెందిన ఎంపీటీసీ చెప్యాల శ్రీనివాస్ తదితరులు కిషన్‌రెడ్డి సమక్షంలో ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న యాదగిరి ఎంతో భావోద్వేగానికి గురయ్యారని, ఇలాంటివారు రాష్ట్రంలో వేలాది మంది ఉన్నారని, చాలామంది త్యాగాలు, ఆత్మబలిదానాలు చేశారని, చివరకు రాష్ట్రం సాకారమైనా.. ఒక కుటుంబం చేతిలో బందీగా మారిందన్నారు. ఎన్నో కాంక్షలతో ఉద్యమం చేసిన ఉద్యమకారులకు ఆవేదనే మిగిలిందన్నారు. నియంతృత్వం, అవినీతి పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న పాలనను భారతీయ జనతా పార్టీ మాత్రమే అందిస్తుందన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఏడేళ్ల కాలంలో లక్షల కోట్ల అప్పులు అయ్యాయని, చివరకు జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితికి దిగజారిందని మండిపడ్డారు.
ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని, సచివాలయం ఉండే తెలంగాణతో పాటు ప్రతిరోజూ సచివాలయానికి సీఎం వచ్చే రోజులు రావాలన్నారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. డబ్బు, నిర్బంధం, అధికార దుర్వినియోగం టీఆరెస్ లక్షణంగా మారిపోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు.