రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలని మోడీ కుట్ర

by GSrikanth |
రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలని మోడీ కుట్ర
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ అన్నారు. గాంధీభవన్‌లో గురువారం ‘మోడీ పరిహార్‌లో అందరూ నేరస్తులే’ అనే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా కోసం మహాలక్ష్మి రూ.500లకే గ్యాస్, ఆరు గ్యారెంటీ స్కీములు అమలు చేస్తుందన్నారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వెల్లడించారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పాంచ్ న్యాయ, పచ్చీసు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు. మోడీ పరివార్‌లో నేరస్తులే ఉన్నారని దుయ్యబట్టారు. ఆ పరివార్‌లో ఉన్న అదానీ, అంబానీలు దేశ సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. ప్రజ్వల్ రేవణ్ణ వేల మంది మహిళలను కిడ్నాప్ చేసి బలత్కారం చేశారని, వారి వీడియోలను చిత్రీకరించడం సిగ్గుచేటన్నారు.

అలాంటి ప్రజ్వల్ రేవణ్ణ కోసం ప్రధాని మోడీ ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్ కుటుంబానికి లోక్ సభ సీటును బీజేపీ ఇచ్చిందన్నారు. దీన్ని మహిళలంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మహిళలను వంటింటికే పరిమితం చేయాలని ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ మహిళలు చైతన్యవంతులు అని, దేశంలో ప్రజాస్వామ్యం, మహిళలకు రక్షణ కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నారు. మహిళలంతా కాంగ్రెస్ కు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story