- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యాంగాన్ని మారిస్తే ప్రతిఘటిస్తాం.. రిజర్వేషన్లు పెంచే పార్టీలకే మా మద్దతు
దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉన్నదని, రిజర్వేషన్లను ఇంకా కొనసాగించాల్సిన అవసరం లేదంటూ ప్రస్తుతం కేంద్రంలో అధికార కూటమికి చెందిన నేతలు వివిధ వేదికలపై అనేక సందర్భాలలో చేస్తున్న ప్రసంగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ నేషనల్ ఇంటెలెక్చువల్ ఫోరం ఖండించింది. ఈ కూటమి పార్టీలు ఇలాంటి వైఖరి తీసుకోవడాన్ని మేధావులు తీవ్రంగా ఖండించారు. రిజర్వేషన్ల వ్యతిరేక వైఖరితో ఇప్పటివరకూ బడుగు, బలహీన వర్గాలు విద్య, ఉద్యోగ రంగాల్లో పొందుతూ ఉన్న రిజర్వేషన్లను కోల్పోవాల్సి వస్తున్నదని, వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఫోరంలో ప్రసంగించిన వక్తలు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తే, దేశ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని, బడుగు, బలహీనవర్గాల ప్రజలు జీవించే హక్కులను కూడా కోల్పోవాల్సిన ప్రమాదం పొంచి ఉన్నదని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాల పట్ల సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తే, వాటిని తీవ్రంగా ప్రతిఘటించాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం పొందింది.
రాజ్యాంగాన్ని మార్చబోమని, ఇప్పుడున్నదాన్నే పటిష్టంగా అమలు చేస్తామని, ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్లు కొనసాగించడంతో పాటు కులగణన అనంతరం ఇంకా పెంచుతామని హామీ ఇస్తున్న రాజకీయ పార్టీల వ్యాఖ్యలపై ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలు సంతోషం వ్యక్తంచేశారు. ఈ వైఖరి తీసుకున్న రాజకీయ పక్షాలను సమర్ధించవలసిన అవసరం ఉన్నదని సమావేశం అభిప్రాయపడింది. రెండు విభిన్న రాజకీయ కూటములు, పక్షాలు అనుసరిస్తున్న విభిన్న వైఖరులను గమనించిన మేధావులు.. దళిత బహుజనులు అత్యంత జాగరూకతతో వ్యవహరించి భవిష్యత్తుకు దోహదపడే నిర్ణయాలు తీసుకునే రాజకీయ పక్షాలకు మద్దతు తెలపాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని దళిత బహుజనులను అప్రమత్తం చేయవలసిన బాధ్యత మేధావులపై ఉన్నదని, వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను చైతన్య పర్చాలని ఈ సమావేశం తీర్మానించింది.
ఈ సమావేశంలో ‘సేవ్ కాన్స్టట్యూషన్ - సేవ్ రిజర్వేషన్స్’ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కాశిం, ప్రొ. గడ్డం మల్లేశం, డాక్టర్ ఆరేపల్లి రాజేందర్, ప్రొ. మురళీదర్శన్, శాతవాహన యూనివర్సిటీకి చెందిన ప్రొ సుజాత సూరేపల్లి, అఖిల భారత ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు చెందిన పీవీ రమణ, గడ్డం ఝాన్సీ, తెలంగాణా అల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రొ. సిహెచ్ శ్రీనివాస్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ మహేష్ రాజ్ తదితరులతో పాటు దాదాపు వంద మందికి పైగా వివిధ వర్గాలకు, వివిధ జిల్లాలకు చెందిన దళిత, బహుజన మేధావులు పాల్గొన్నారు.