కాంగ్రెస్‌కు 17.. ఎస్పీకి 63.. యూపీలో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు!

by Swamyn |
కాంగ్రెస్‌కు 17.. ఎస్పీకి 63.. యూపీలో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) బయటకు వస్తుందనే ఊహాగానాలకు అఖిలేశ్ యాదవ్ బుధవారం చెక్ పెట్టిన అనంతరం.. అదే పార్టీకి చెందిన సీనియర్ నేత రవిదాస్ మెహ్రోతా సీట్ల పంపకాలపై స్పందించారు. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో.. ఎస్పీ అత్యధికంగా 63 నియోజకవర్గాల్లో పోటీ చేయనుండగా, కాంగ్రెస్ 17 సీట్లలో బరిలోకి దిగనుందని వెల్లడించారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, ఎస్పీ కలిసే బరిలోకి దిగుతాయని, ఈ నిర్ణయం ఇండియా కూటమిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఇండియా కూటమే విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని, బీజేపీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చేయాలని సూచించారు. యూపీలో మొత్తం 80 స్థానాల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. అలాగే, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, వాటిని ఉపయోగించి ప్రతిపక్షాలను బలహీనపర్చాలని కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాగా, అంతకన్నా ముందు పార్టీ ఆఫీసులో అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, యూపీలో కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీట్ షేరింగ్ విషయంలో చర్చలు సజావుగానే జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని వెల్లడించగా, ఆ వెంటనే రవిదాస్ మెహ్రోత్రా పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


Advertisement

Next Story