ఓల్డ్‌సిటీలో పొలిటికల్ గేమ్.. ఎంబీటీ ఓటు బ్యాంక్ ఎటువైపు..?

by Disha Web Desk 2 |
ఓల్డ్‌సిటీలో పొలిటికల్ గేమ్.. ఎంబీటీ ఓటు బ్యాంక్ ఎటువైపు..?
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: పాతబస్తీలో ఎంఐఎంకు ధీటుగా ఎదిగిన మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) తాజా లోక్ సభ ఎన్నికలలో పోటీ నుంచి ఉపసంహరించుకోవడం సంచలనంగా మారింది. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సైతం ఆ పార్టీ అభ్యర్థి అంజదుల్లాఖాన్ యాకుత్‌పురా నుంచి పోటీచేసి కేవలం 878 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుసేన్ మెరాజ్ చేతిలో ఓటమి పాలయ్యారు. నాటి అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని రౌండ్లలో ఎంఐఎం అభ్యర్థి కంటే లీడ్ సైతం సాధించారు. విజయం ఖాయమనుకున్న తరుణంలో అనూహ్యంగా ఎంఐఎం అభ్యర్థి లీడ్ తీసుకుని గెలుపును సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 13న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలలో పాతబస్తీలో అన్ని ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అందరూ అంచనా వేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎంబీటీ పోటీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

బీజేపీకి ఎదురుదెబ్బ..?

పాతబస్తీలో పాగా వేయాలని బీజేపీ సుమారు 40 యేండ్లుగా విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ గెలుపు అందని ద్రాక్ష పుల్లన అన్న చందంగా మారింది. గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎంఐఎం చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే ఈ పర్యాయం పార్టీ అభ్యర్థిని సైతం మార్చింది. విరించి హాస్పిటల్ చైర్ పర్సన్ మాధవీలత కొంపెల్లను పార్లమెంట్ బరిలోకి దించింది. దీనికి తోడు అయోద్యలో శ్రీరామ విగ్రహం ప్రతిష్టతో పాతబస్తీలో బీజేపీ కొంత పుంజుకుంది. పార్టీలకతీతంగా హిందూ ఓట్లు పడతాయని అంచనా వేసింది. గట్టిగా ప్రయత్నం చేస్తే హైదరాబాద్ స్థానాన్ని కమలం ఖాతాలో వేసుకోవచ్చనే అభిప్రాయంతో పార్టీ ఉంది. అయితే అనూహ్యంగా ఎంబీటీ పోటీ నుంచి తప్పుకోవడంతో మైనార్టీల ఓట్లు ఎంఐఎంకు పోలయ్యే అవకాశం ఉంది. ఇది బీజేపీ గెలుపుపై నీళ్లు చల్లినట్లు అయ్యే అవకాశం ఉందనే చర్చ నియోజకవర్గం వ్యాప్తంగా నడుస్తోంది.

ఎంబీటీ ఓటు బ్యాంక్ ఎటువైపు..?

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ విషయంలో తాజాగా ఎంబీటీ తీసుకున్న నిర్ణయంతో ఆ పార్టీ ఓటు బ్యాంక్ ఎటువైపు? ఎంబీటీ అభిమానులు తమ ఓట్లను ఎవరికి వేస్తారనేది నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఎంఐఎం, ఎంబీటీలను మైనార్టీలకు చెందిన పార్టీలుగానే గుర్తింపు దక్కింది. ఈ రెండు పార్టీలకు ఘనమైన మైనార్టీ ఓటు బ్యాంక్‌తో పాటు రాజకీయ వైరుద్యం ఉంది. జీహెచ్ఎంసీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఇలా ఏ ఎన్నికలు జరిగినా బాహాబాహీగా బరిలోకి దిగుతాయి. ఇదే నేపథ్యంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ పోటీ పడ్డాయి. అయితే నెలల వ్యవధిలోనే రాజకీయంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పాతబస్తీలో బీజేపీ బలపడే అవకాశం ఉండడంతో ఎంబీటీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుందనే చర్చ జరుగుతోంది. ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీ అభ్యర్థి సమీర్ వలీ ఉల్లాఖాన్‌కు టికెట్ కేటాయించడంతో పోరు రసవత్తరంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌యాదవ్ కూడా బలమైన నాయకుడే కావడం, మైనార్టీలతో సంత్సంబంధాలు ఉండడం ఎంబీటీ ఓటు బ్యాంక్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మతతత్వ శక్తులను ఓడించేందుకే..

మతతత్వ శక్తులను ఓడించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) నిర్ణయించిందని ఆ పార్టీ అధ్యక్షుడు మజీదుల్లా ఖాన్ అలియాస్ ఫర్హాత్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..దేశంలోని ప్రస్తుత పరిస్థితులు సమాజం ఐక్యంగా ఉండి మతతత్వ శక్తులను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఎంబీటీ పార్టీ పోటీ చేస్తే మా అభ్యర్థికి 1.5 లక్షల నుంచి 2 లక్షల ఓట్లు సులువుగా వస్తాయి. ఓట్లు చీలిపోవడం కారణంగా బీజేపీ పార్టీ లాభపడుతుందని, సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల పోటీని త్యాగం చేశామని ఫర్హతుల్లా ఖాన్ అన్నారు.



Next Story

Most Viewed