అప్పుడే 79వేల ఉల్లంఘనలు.. 99శాతం పరిష్కరించిన ఈసీ

by Swamyn |
అప్పుడే 79వేల ఉల్లంఘనలు.. 99శాతం పరిష్కరించిన ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలై రెండు వారాలైనా గడవకముందే, కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి వేలాది ఫిర్యాదులు నమోదయ్యాయి. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తీసుకొచ్చిన సీ-విజిల్ యాప్‌కు కంప్లయింట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 16న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగా, అప్పటి నుంచి ఇప్పటివరకు సీ-విజిల్ యాప్ ద్వారా ఈసీకి ఏకంగా 79వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం శుక్రవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈసీఐ అధికారిక ప్రకటన ప్రకారం, ‘‘ఇప్పటివరకు 70వేలకు పైగా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులు అందగా, వాటిలో 99శాతానికి పైగా ఫిర్యాదులను పరిష్కరించాం. 89శాతం ఫిర్యాదులు కేవలం 100 నిమిషాల్లోపే పరిష్కరించాం. వేగం, పారదర్శకతనే సీ-విజిల్ యాప్‌కు మూల స్తంభాలు’’ అని పేర్కొంది.

హోర్డింగ్‌లు, బ్యానర్లపైనే ఎక్కువగా..

సీ-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదుల్లో అత్యధికంగా 58,500కు పైగా కంప్లయింట్స్(73శాతం) అక్రమ హోర్డింగ్, బ్యానర్లకు సంబంధించినవేనని ఈసీ వెల్లడించింది. 1400కు పైగా ఫిర్యాదులు డబ్బు, బహుమతులు, మద్యం పంపిణీకి సంబంధించినవి ఉన్నాయని వివరించింది. ఆయుధాల ప్రదర్శన, బెదిరింపులపై వచ్చిన 535 ఫిర్యాదులలో ఇప్పటికే 529 పరిష్కరించామని పేర్కొంది. కాగా, లోక్‌సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. వీటి ఫలితాలు జూన్ 6న వెల్లడవుతాయి.


Advertisement

Next Story