ప్రచారానికి దూరంగా కీలక నేతలు.. ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితులు తప్పవా?

by GSrikanth |
ప్రచారానికి దూరంగా కీలక నేతలు.. ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితులు తప్పవా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కానీ నియోజకవర్గాల నుంచి నేతల సహకారం అందడం లేదని సమాచారం. సమావేశాలకు పిలిస్తే వస్తున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం ముఖం చాటేస్తున్నారని పార్టీలోని కొందరు నేతలే అభిప్రాయపడుతున్నారు. కొందరు మాజీ ప్రజాప్రతినిధులైతే పార్టీ ప్రచారానికి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని సమాచారం.

సిట్టింగ్ స్థానాలైనా దక్కేనా?

లోక్‌సభ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలువాలని, కనీసం సిట్టింగ్ స్థానాలైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించింది. అయితే ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించే సమయంలో నియోజకవర్గంలో ముఖ్య నేతలను సంప్రదించలేదని గుర్రుగా ఉన్నారు. కేవలం ఒకరిద్దరి అభిప్రాయం మేరకే వారికి టికెట్లు ఇచ్చారని సీనియర్ నేతలు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో ఉండని వారిని, కేడర్‌ను కలుపుకొని పోనివారికి టికెట్ ఇస్తే ఎలా గెలుస్తామని పలువు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమావేశాలకు నామ్ కే వస్తేగా హాజరవుతున్నారనే ప్రచారం ఉంది.

కొరవడిన సమన్వయం

మరోవైపు ఎంపీ అభ్యర్థులు సైతం స్థానిక లీడర్లను ప్రచారంలో కలుపుకొని పోవడం లేదని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో బలమైన నాయకులు ఎవరు.. ఎవరికి ఆ నియోజకవర్గంలో పట్టుంది... ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే వివరాలు తెలియకపోవడంతో విఫలమవుతున్నారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అంతేగాకుండా రాష్ట్రస్థాయిలో పనిచేసిన నేతలు, కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేసినవారున్నప్పటికీ సమన్వయం చేయడం లేదని పలువురు మండిపడుతున్నారు. నేతలనే సమన్వయం చేయడంలో వెనుకబడిన ఎంపీ అభ్యర్థులు... కేడర్‌ను ఎలా ఏకం చేస్తారని, ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మాజీలంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం.

ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు తప్పవా?

గతంలో బీఆర్ఎస్‌లో యాక్టివ్ లీడర్లు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఢీలా పడ్డారు. ఓడిపోయి కొందరు.. ఎమ్మెల్యేగా గెలిచిన వారు సైతం బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో నైరాశ్యంలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యం, ప్రైవేటు సర్వేల్లోనూ పార్టీపై ఆశించిన స్థాయిలో సానుకూల పవనాలు రాకపోవడంతో నేతలు డైలమాలో పడ్డారు. పార్టీ గెలిచే అవకాశం లేదని.. ఇతర పార్టీలకు ఓటు వేయాలని అనుచరులకు ఇంటర్నల్‌గా సూచనలిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే బీఆర్ఎస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డుకాలం తప్పని పరిస్థితి. భువనగిరి, నల్లగొండ, జహీరాబాద్, ఖమ్మం, చేవెళ్ల, మల్కాజిగిరి, హైదరాబాద్ పార్లమెంటు స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు నేతలందరినీ కలుపుకొని పోవడం లేదని, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ఇలా మరికొన్ని స్థానాల్లో ఎంపీ అభ్యర్థులకు పార్లమెంటు పరిధిలోని నేతలకు సహకారం కరువైందని సమాచారం.

ఆశించింది ఒకటి.. జరుగుతోంది మరొకటి

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని భావించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతుందని, 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉంటే అందులో కొన్నింటినే అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని పార్టీ అధిష్టానం భావించింది. మరో పక్క రైతు బంధు, రుణమాఫీ చేయలేదని కలిసి వస్తుందని ఆశించింది. కానీ ఆశించిన స్థాయిలో రాలేదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఇంకా కాంగ్రెస్‌పై వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. బీఆర్ఎస్ ఆశించింది ఒకటి.. ప్రజల నుంచి మరో అభిప్రాయం వస్తుండటంతో లోక్‌సభ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంటుందా? లేదా? అనేది పార్టీలో చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story